YSRCP: కాపు సామాజికవర్గం ఓట్లపై వైసీపీ ఫోకస్.. ఏం జరుగుతోందో తెలుసా?
కూటమిలో జనసేన కీలకంగా ఉండటంతో గోదావరి జిల్లాల్లోని కాపులంతా కూటమివైపు మొగ్గు చూపారు.

అధికారంలో ఉన్నప్పుడు ఏ ఈక్వేషన్లు పట్టించుకోలేదు. అందుకు నష్టపరిహారం చెల్లించుకోక తప్పలేదు. అపోజిషన్‌లోకి వచ్చాక రూటు మార్చారు వైసీపీ అధినేత. ఎక్కడ మిస్టేక్ జరిగిందో సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో తమకు దూరమైన బలమైన సామాజిక వర్గాన్ని తిరిగి వైసీపీ కంచుకోటగా మార్చుకునే వ్యూహం రచిస్తున్నారట మాజీ సీఎం జగన్. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ పదవులు అన్నీ కాపులకే కేటాయించారన్న టాక్ వినిపిస్తోంది.
రీజనల్ కోఆర్డినేటర్‌గా మాజీ మంత్రి కన్నబాబుని నియమించారు జగన్. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే బొత్స సత్యనారాయణకు స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అవకాశం ఇచ్చి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ ర్యాంక్ హోదాను కట్టబెట్టారు.
వీరికి పదవులు
పైగా బొత్సకు గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవిని కూడా ఇచ్చారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికే చెందిన గుడివాడ అమర్నాథ్‌ను నియమించారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జిగా మరో కాపు నాయకుడు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని పెట్టారు. కాకినాడ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్‌గా మాజీమంత్రి దాడిశెట్టి రాజాను నియమించడం కూడా కాపులకు దగ్గరయ్యే వ్యూహమేనట.
ఇప్పటికే కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంను వైసీపీలోకి తెచ్చిన అధి నాయకత్వం సరైన సమయం చూసి కాపుల తరఫున ఆయన గొంతు విప్పేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రతీ ఎన్నికల్లోనూ ఒక్కో పార్టీకి అండగా నిలుస్తూ..తమ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చేవారి వైపే మొగ్గు చూపుతున్నారు కాపులు.
ఇప్పుడు వైసీపీ కాపులకు అనుకూలంగా మరిన్ని నిర్ణయాలు తీసుకుని..ఇప్పుడు పార్టీ పదవులు ఇవ్వడంతో పాటు పాటు భవిష్యత్‌లో అధికారంలోకి వస్తే ఉన్నత పదవులు కట్టబెడుతామని హామీ ఇవ్వడం ద్వారా ఆ బలమైన సామాజిక వర్గాన్ని తమవైపునకు తిప్పుకోవాలని భావిస్తున్నారట వైఎస్ జగన్.
ఏపీ ఎన్నికల్లో ప్రతీసారి ఏదో ఒక సామాజికవర్గం ఎఫెక్ట్‌తో ప్రభుత్వం మారుతూ వస్తూ ఉంటోంది. బలమైన సామాజిక వర్గం గెలుపోటములను డిసైడ్ చేయడం కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం. అందులో ప్రధానంగా కాపులు ఏపీ రాజకీయాలను మలుపు తిప్పుతూ ఉంటారు.
అప్పట్లో కాంగ్రెస్.. ఆ తర్వాత..
మొదటి నుంచి కాంగ్రెస్‌ని అంటిపెట్టుకుని రాజకీయం చేస్తూ వచ్చిన కాపులు.. టీడీపీ ఆవిర్భావం తర్వాత మాత్రం రాజకీయంగా ఆప్షన్లు తీసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక ఎన్నికలో కాంగ్రెస్‌కు అండగా నిలిస్తే మరో ఎన్నికలో టీడీపీని గెలిపిస్తూ వచ్చారు. విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో టీడీపీని ఎంచుకున్నారు కాపులు.
అందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతు పలకడం ప్రధాన కారణం. ఇక 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేసినా కాపులు వైసీపీ వెంట నడిచారు. కాపుల రిజర్వేషన్ విషయంలో టీడీపీ మాట తప్పిందన్న ఆగ్రహంతో ఫ్యాన్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ సీన్ మారిపోయింది. మొన్నటి ఎలక్షన్స్‌లో కాపులంతా గంప గుత్తగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి జైకొట్టారు.
కూటమిలో జనసేన కీలకంగా ఉండటంతో గోదావరి జిల్లాల్లోని కాపులంతా కూటమివైపు మొగ్గు చూపారు. దాంతో ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ క్లీన్ స్వీప్ చేశాయి. కోస్తాలో చాలా జిల్లాల్లో ఎన్నడూ లేని విధంగా కూటమి బంపర్ విక్టరీ కొట్టిందంటే దాని వెనుక కాపులు ఉన్నారని అభిప్రాయాలు ఉన్నాయి.
ఈ సామాజిక సమీకరణలతో గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా దెబ్బతింది. అయితే ఓటమిని సమీక్షించుకుంటోన్న వైసీపీ.. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పట్టు కోసం కాపు కార్డు బయటకు తీస్తోంది అంటున్నారు. పార్టీ పదవుల్లో కాపులకు పెద్ద పీట వేయడం ద్వారా తిరిగి వారికి దగ్గర కావాలని వైసీపీ హైకమాండ్ ఆలోచన చేస్తోందట. అందుకే కాపు లీడర్లకు పదవులు కట్టబెడుతున్నారని అంటున్నారు. జగన్ వ్యూహం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.