Hyderabad Adulterated Ghee : హైదరాబాద్‌లో 25000 కిలోల కల్తీ నెయ్యి.. ఎలా తయారు చేస్తున్నారో చూడండి..
Hyderabad Adulterated Ghee : హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై పోలీసులు, అధికారులు భారీగా దాడులు నిర్వహించారు.
- Harish Thanniru
- Updated on- August 18, 2026 / 03:05 PM IST
Police Seizes 36,000 Kg of Adulterated Ghee in HYD
Hyderabad Adulterated Ghee : హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై పోలీసులు, అధికారులు భారీగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 25.5 టన్నుల కల్తీ నెయ్యి, 8.7 టన్నుల క్రీమ్, 1,200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల వనస్పతి, డాల్డా సహా మొత్తం దాదాపు 36టన్నుల కల్తీనెయ్యి, తయారీ సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నగర సీపీ సజ్జనార్ వెల్లడించారు.
Also Read : Ayesha Gilani : పాక్‌లో దారుణం.. టిక్‌టాక్ స్టార్ ఆయేషా గిలానీ హత్య! ఫోన్ చేసింది ఎవరు? హత్య చేసిందీ వారేనా?
స్కిమ్డ్ మిల్క్, క్రీమ్, పామాయిల్, వనస్పతి, గంజి, బొంబాయి రవ్వ తదితర పదార్థాలను కలిపి నెయ్యిని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం దానిని ఆవు నెయ్యి, దేశీ నెయ్యి పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కల్తీ నెయ్యిని ఫంక్షన్లలో ఉపయోగించడంతో పాటు ‘ప్యూర్ నెయ్యితో తయారు చేసిన స్వీట్లు’ పేరుతో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ దీనిని వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
నగర వ్యాప్తంగా 130 నెయ్యి తయారీ, విక్రయ కేంద్రాలపై ఏకకాలంలో హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందాలు దాడులు నిర్వహించాయి. దాడుల్లో 30 కిలోల గంజి, నెయ్యి ఫ్లేవర్ కోసం ఉపయోగించే మూడు రకాల ఆరు బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి క్రీమ్‌ను తీసుకొచ్చి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కల్తీ నెయ్యిని విక్రయిస్తున్న ప్యాకెట్లపై ఎలాంటి లేబుల్స్ లేవని అధికారులు తెలిపారు. తయారీ తేదీ, గడువు తేదీ, తయారీదారు పేరు, కంపెనీ వివరాలు కూడా లేవని చెప్పారు.
స్వాధీనం చేసుకున్న నెయ్యి నమూనాలను పరీక్షలకు పంపించినట్లు అధికారులు తెలిపారు. నెయ్యి నాణ్యతను గుర్తించేందుకు ఉపయోగించే RM Valueలో మార్పులు కనిపించినట్లు వెల్లడించారు. పామాయిల్ కలపడం వల్ల ఈ విలువ పెరగడం, వనస్పతి వంటి పదార్థాలతో దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు వివరించారు. కల్తీ నెయ్యి వినియోగం వల్ల గుండె సంబంధిత సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. నెయ్యి తయారీకి వినియోగించకూడదని స్పష్టంగా పేర్కొన్న ఫ్లేవర్ బాటిళ్లను కూడా నెయ్యి తయారీలో ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.
కల్తీ ఆహార పదార్థాలపై టీజీ సేఫ్‌తో సమన్వయం చేసుకుని మరిన్ని దాడులు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణను కల్తీ ఆహారం నుంచి విముక్తి చేయడమే లక్ష్యంగా చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కల్తీ ఆహార తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
