త్వరలో తెలంగాణ శాసనమండలిలో 9స్థానాలు ఖాళీ కాబోతున్నాయ్… అనే నేను ఎమ్మెల్సీగా అనేందుకు అధికార, విపక్షాల్లో నేతలు ఎవరి ప్రయత్నాలు వాళ్లు మొదలుపెట్టారు. వీటిలో ఒకే ఒక్క స్థానం గులాబీ పార్టీకి దక్కనుంది. దీంతో ఆ సీటు దక్కించుకుబోయే అదృష్టవంతుడు ఎవరా అని.. కారు పార్టీలో జోరుగాచర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ ఒక్క స్థానానికి పోటీ పడుతోంది ఎవరు.. కేసీఆర్ మనసులో ఎవరి పేరు ఉంది..
పెద్దల సభలో మరికొన్ని నెలల్లో పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. శాసనసభ్యుల కోటా, పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన నేతల పదవీకాలం కంప్లీట్ కానుంది. వీరిలో గులాబీ పార్టీకి చెందిన మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం పదవీకాలం పూర్తికాబోతోంది.
ఎంఐఎం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీర్జా రియాజ్ ఉల్ ఎఫెన్దీ… పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవన్ రెడ్డి… ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సిరెడ్డి, రఘోత్తమ్ రెడ్డి పదవీకాలం పూర్తి కానుంది. శాసనసభ్యుల సంఖ్యా బలంపరంగా.. అధికార పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయ్. రెండు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేసే చాన్స్ ఉంది.
ఇప్పటి నుంచే చర్చలు మొదలు
ఎమ్మెల్యే కోటాలో పదవీకాలం పూర్తవుతున్న నలుగురు గులాబీ నేతల్లో… కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన శేరి సుభాష్ రెడ్డి, మహముద్ అలీ ఉన్నారు. ఐతే త్వరలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలపై గులాబీ పార్టీలో ఇప్పటి నుంచే చర్చలు మొదలయ్యాయ్. శాసనసభ్యుల సంఖ్యాపరంగా.. రెండు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేసే చాన్స్ ఉంది. ఐతే పది మంది ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పడంతో.. ఒకే ఒక్క స్థానం మాత్రమే గులాబీ పార్టీ దక్కించుకోనుంది.
ఆ ఒక్కరు ఎవరన్నది ఇప్పుడు పార్టీలో చర్చకు దారి తీస్తోంది. ఈ స్థానాన్ని ఎవరికీ కట్ట పెట్టాలన్న దానిపై… పార్టీ ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. ఈ మధ్యపార్టీ సంకేతాలు పంపుతోంది. దీంతో బీసీలకు ఈ స్థానాన్ని కేటాయించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. బీసీ సామాజికవర్గానికి చెందిన దాసోజు శ్రవణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గవర్నర్ కోటాలో ప్రభుత్వం నామినేట్ చేసినా… గత గవర్నర్ ఆమోదం తెలుపకపోవడంతో శ్రవణ్ కు శాసనమండలి అవకాశం దక్కలేదు.
భారీగా ఆశలు
ఎంబీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు చెందిన నేతలు కూడా ఈ స్థానంపై భారీగా ఆశలు పెంచుకున్నారు. మైనారిటీ సామాజికవర్గానికి చెందిన వారిలో… మాజీ హోం మంత్రి మహమ్మద్ అలీ మరోసారి తనకే అవకాశం దక్కుతుందని ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్సీ పదవులు హామీని పొందిన పలువురు నేతలు కూడా.. తమకు ఈ విడత అవకాశం కల్పించాలని కేసీఆర్ ను కోరుతున్నట్లు తెలుస్తోంది.
దేవిప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా… మరికొంతమంది కూడా శాసనమండలి పదవిపై భారీగా ఆశలు పెట్టుకున్నారని గులాబీ పార్టీలో చర్చ జరుగుతుంది. ఒక్క స్థానం మాత్రమే పార్టీకి దక్కే అవకాశం ఉండడంతో… ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పరిస్థితులకు అనుగుణంగా కేసిఆర్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది.
కార్ రేస్ కేసు కంటే ముందే అరెస్ట్ అవుతారా? కేటీఆర్ మాటలకు అర్థం అదేనా ?