కార్ రేస్ కేసు కంటే ముందే అరెస్ట్ అవుతారా? కేటీఆర్ మాటలకు అర్థం అదేనా ?
కాంగ్రెస్ సర్కార్‌కు.. లగచర్ల దాడి ఘటన రాజకీయంగా కలిసి వచ్చిందనే టాక్ నడుస్తోంది.

KTR-Revanth Reddy
అనుకున్నామని జరగవు కొన్ని.. అనుకోలేదని ఆగవు అన్నీ ! సినిమా పాట అయినా.. ప్రస్తుత తెలంగాణ రాజకీయాలకు పక్కాగా సరిపోయే మాట ఇది. కేటీఆర్ అరెస్ట్ అంటూ.. కొంతకాలంగా జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. కారు రేసులో కేటీఆర్ అరెస్ట్ ఖాయం అని అనుకున్నారు అంతా ! ఐతే ఇప్పుడు సీన్ మారిపోయినట్లు కనిపిస్తోంది. లగచర్ల దాడి ఘటనలో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా.. ఏ క్షణంలోనైనా ఆయన అరెస్ట్ కాబోతున్నారా.. ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్లు తెలంగాణ రాజకీయాల్లో టెన్షన్ వాతావరణ కనిపిస్తోందిప్పుడు.
తెలంగాణ రాజకీయం మహారంజుగా సాగుతోంది. దాడులు, కేసులు, అరెస్టులతో… పొలిటికల్ వెదర్ వాడీవేడీగా కనిపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ సర్కార్.. విచారణ కూడా మొదలుపెట్టింది. ఏ క్షణంలోనైనా బీఆర్ఎస్ ముఖ్యనేతలు అరెస్ట్ అవుతారంటూ మంత్రులు చెప్తూ వస్తున్నారు. దీపావళికి ముందు బాంబ్ పేలుతుందని మంత్రి పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో.. మరింత రచ్చ మొదలైంది.
తెలంగాణ సర్కార్ లీక్‌లు
చాలా అభియోగాల్లో కేటీఆర్ ప్రమేయం ఉందని.. ముందు అరెస్ట్ అయ్యేది ఆయనే అంటూ తెలంగాణ సర్కార్ లీక్‌లు ఇస్తూ వస్తోంది. ఈ-ఫార్ములా కారు రేసు వ్యవహారంలో.. కేటీఆర్‌ను విచారించేందుకు.. రేవంత్ సర్కార్ గవర్నర్ అనుమతి కోరింది కూడా ! అరెస్ట్‌కు తాను సిద్ధం అని.. జైలుకెళ్లి రేస్ట్ తీసుకునేందుకు రెడీ అంటూ కేటీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్లు.. రాజకీయాన్ని మరింత రంజుగా మార్చాయ్. ఇలాంటి పరిణామాల మధ్య.. లగచర్ల ఘటన రూపంలో రాష్ట్రంలో అనూహ్య పరిమామాలు చోటుచేసుకున్నాయ్.
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మాసంస్థల ఏర్పాటుకు సంబంధించి.. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్ సహా ప్రభుత్వ అధికారులపై దాడి ఘటన.. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రేవంత్ సర్కార్.. దానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చింది.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు పోలీసులు. ఐతే లగచర్ల దాడి ఘటనలో కేటీఆర్ ప్రమేయం ఉంది అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తుండగా.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయ్. నరేందర్ రెడ్డి రిమాండ్‌రిపోర్టులో కేటీఆర్ పేరు కూడా కేటీఆర్ పేరు కనిపించింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్‌తో పాటు ఇతరుల ఆదేశాలు ఉన్నట్లు అందులో వివరించారు. దీంతో ఏ క్షణంలోనైనా కేటీఆర్ అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం మొదలైంది.
అరెస్ట్ ఖాయం అంటూ జరుగుతున్న ప్రచారంపై.. కేటీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ మీద విమర్శలు గుప్పించారు. ఎవరిది కుట్ర.. ఏంటి కుట్ర అంటూ రెచ్చిపోయిన కేటీఆర్.. ఓటేసిన పాపానికి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా.. అల్లుని కోసమో, అన్న కోసమో.. రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా.. గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా.. ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చేయడం ఎవరి కుట్ర.. మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర అంటూ ప్రశ్నలు గుప్పించారు.
ఎప్పుడో తెలుసని అంటున్న కేటీఆర్
తనను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసని.. రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతానని.. కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరని.. చేసుకో అరెస్ట్ అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. ఫార్ములా కార్ రేసు వ్యవహారంలో.. కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరగా.. ఆయన దాన్ని పెండింగ్‌లో పెట్టారు. దీంతో రాజ్‌భవన్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ సర్కార్‌కు.. లగచర్ల దాడి ఘటన రాజకీయంగా కలిసి వచ్చిందనే టాక్ నడుస్తోంది.
లగచర్ల దాడి ఘటన వెనక కుట్ర కోణం ఉందని ఆరోపిస్తున్న రేవంత్ సర్కార్.. అందుకు సంబందించిన విచారణను వేగవంతం చేసింది. రిమాండ్‌లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని కస్టడీకి కోరనున్న పోలీసులు… అనుమతి రాగానే ఆయనను విచారించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో కేటీఆర్ పేరు కచ్చితంగా బయటకు వస్తుందని.. అప్పుడు ఆయన అరెస్ట్ తప్పదని భావిస్తున్నారు. ఐతే కారు రేసు వ్యవహారంలో అరెస్ట్ అవుతారనుకున్న కేటీఆర్.. అనూహ్య పరిణామాల మధ్య లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అవుతారనే ప్రచారం నడుస్తుండడంతో… తెలంగాణలో రాజకీయం రంజు మీద కనిపిస్తోంది.
100 శాతం జాబ్ గ్యారెంటీ లాంటి ప్రకటనలు వద్దు- కోచింగ్ సెంటర్లకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు