Jupally and Ponguleti
Ponguleti Srinivas Reddy: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ పార్టీలో చేరికపై స్పష్టత వచ్చింది. ఈనెల 30న ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో జరిగే బహిరంగ సభల ద్వారా తమ అనుచరులతో ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈ సభల్లో రాహుల్ లేదా ప్రియాంకా గాంధీ పాల్గొనే అవకాశం ఉంది. అయితే, అంతకుముందు ఈనెల 22న ఇరువురు నేతలు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు.
Ponguleti Srinivasa Reddy : కాంగ్రెస్‌లోకి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఈనెల 22న రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, దామోదర రెడ్డి, పిడమర్తి రవి, పలువు నేతలు భేటీ కానున్నారు. ఈ భేటీలో రాహుల్ గాంధీతో పలు అంశాలపై చర్చించిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు జూపల్లి, పొంగులేటి ప్రకటిస్తారని తెలుస్తోంది. వీరంతా ఈనెల 30న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఈనెల 30న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ద్వారా పొంగులేటి, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సభలో రాహుల్ లేదా ప్రియాంక గాంధీలలో ఒకరు పాల్గోనున్నారు. అయితే, 30వ తేదీనే ఖమ్మంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 30వ తేదీనే రెండు సభలు జరుగుతాయా? వేరువేరు తేదీల్లో సభల నిర్వహణ ఉంటుందా అనేది రాహుల్ గాంధీతో భేటీ తరువాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తన అనుచరులతో కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే తన అనుచరులకు ఈ విషయంపై పొంగులేటి స్పష్టతనిచ్చినట్లు తెలిసింది. పొంగులేటితో పాటు పాయం వేంకటేశ్వర్లు, కోరం కనకయ్య, పిడమర్తి రవి, తెల్లం వెంకట్రావు, బానోత్ విజయాబాయి, కోటా రాంబాబు, మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, కొండూరి సుధాకర్, జారే ఆదినారాయణ, దొడ్డా నగేష్ యాదవ్ లతో పాటు మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో జూపల్లి కృష్ణారావు టీంతో పాటు దామోదర్ రెడ్డి, మేఘారెడ్డి, కుచ్చారెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం.