Ganesh Laddu : రూ.35 లక్షలు, రూ.51 లక్షలు, రూ.2కోట్లు, లడ్డూ వేలంతో వచ్చిన డబ్బుతో ఏం చేస్తారు?

వినాయక చవితి అంటే ప్రధానంగా గుర్తుకొచ్చేది లడ్డూ వేలం పాట.. గణపయ్య చేతిలోని లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు.

Ganesh Laddu : రూ.35 లక్షలు, రూ.51 లక్షలు, రూ.2కోట్లు, లడ్డూ వేలంతో వచ్చిన డబ్బుతో ఏం చేస్తారు?

Ganesh laddu auction

Updated On : September 6, 2025 / 12:13 PM IST

Ganesh Laddu : వినాయక చవితి అంటే చాలు హైదరాబాద్‌లో జరిగే శోభాయాత్రలు, గణనాథుడి లడ్డూ (Ganesh Laddu) వేలం పాటలే ఎక్కువగా గుర్తొస్తాయి. వినాయకుడి చేతిలో ఉండి.. పూజలందుకున్న లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. అయితే, గణనాథుడి లడ్డూ వేలంపాట అంటే ముందుగా గుర్తుకొచ్చేది బాలాపూర్ గణేశ్ లడ్డూనే.

Also Read: Balapur Ganesha laddu: బాలాపూర్ లడ్డూ వేలంలో రికార్డు బ్రేక్.. ఈ ఏడాది ఎంత ధర పలికింది.. ఎవరు దక్కించుకున్నారంటే..?

గణనాథుల వద్ద లడ్డూలను వేలంపాటలో దక్కించుకుంటే వారి కుటుంబం సుఖసంతోషాలతో ఉండటంతోపాటు ఆర్థికంగా బలోపేతం అవుతారని భక్తుల నమ్మకం. అందుకు గణపయ్య లడ్డూలను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడుతుంటారు. అయితే, లడ్డూపాట వేలం అంటే బాలాపూర్ లడ్డూనే ముందుగా గుర్తుకొస్తుంది. కానీ, ఈసారి రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడజాగీర్ కీర్తి రిచ్‌మండ్ విల్లాలో లడ్డూ రూ.2కోట్ల 30లక్షలు రికార్డు ధర పలికింది.

బాలాపూర్ గణనాథుడి లడ్డూను దక్కించుకునేందుకు ఈసారి కూడా తీవ్ర పోటీ జరిగింది. గతేడాది వేలంలో లడ్డూను రూ. 30లక్షల ఒక వెయ్యికి దక్కించుకున్నారు. ప్రస్తుతం (2025లో) లింగాల శశిథర్ గౌడ్ అనే వ్యక్తి రూ. 35లక్షలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నాడు. ఇక్కడి లడ్డూ వేలంపాట చరిత్రలో ఇదే అత్యధిక ధర కావటం గమనార్హం. మరోవైపు.. హైదరాబాద్ బండ్లగూడజాగీర్ పరిధిలోని కీర్తి రిచ్‌మండ్‌ విల్లాలో గణపయ్య లడ్డూ రూ.2 కోట్ల 30 లక్షల రికార్డు ధర పలికింది. అదేవిధంగా.. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని మైహోమ్ భుజ గేటెడ్ కమ్యూనిటీ గణేశ్ లడ్డూ రూ.51,07,777 పలికింది. గతేడాది ఇక్కడ గణపయ్య లడ్డూ రూ.29లక్షలు పలకగా.. ఈసారి రూ.51,07,777 రికార్డు ధర పలికింది.

లడ్డూ వేలంతో వచ్చిన డబ్బుతో ఏం చేస్తారు?

♦ బాలాపూర్ గణపతి లడ్డూ వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును ఉత్సవ సమితి గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తుంది. ఇప్పటి వరకు రూ.1,60,87,970 ఖర్చు చేసినట్లు ఉత్సవ సమితి వెల్లడించింది. ఈ ఏడాది బాలాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణకు రూ.80వేలు ఖర్చు చేసినట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. గ్రామాభివృద్ధి కోసం వినియోగించిన నిధుల వివరాలతో ఉత్సవ కమిటీ ప్లెక్సీ ఏర్పాటు చేస్తుంది. తద్వారా నిధుల వినియోగంలో పారదర్శకతను చాటుకుంటున్నారు.
♦ హైదరాబాద్ రాజేంద్రనగర్‌ పరిదిలో బండ్లగూడ జాగీర్ కీర్తి రిచ్‌మండ్ విల్లాలో గణనాథుడి లడ్డూ ధర వేలంలో రూ.2కోట్ల 30లక్షల రికార్డు ధర పలికింది. అయితే, లడ్డూపాట ద్వారా వచ్చిన డబ్బును నిర్వాహకులు ట్రస్టులకు అందజేస్తారు. 42ఎన్జీవోలను నిర్వహించే ఓ ట్రస్టుకు లడ్డూ వేలంపాట ద్వారా వచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్తిగా వలంటీర్లతో నడిచే ఈ ట్రస్టు ద్వారా 10వేల మందికి సాయం అందుతోంది. ప్రతీపైసా నేరుగా క్షేత్రస్థాయిలోకే వెళ్తుందని అంటున్నారు.
♦ హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని మైహోమ్ భుజ గేటెడ్ కమ్యూనిటీలో గణపతి లడ్డూను ఖమ్మం జిల్లా ఇల్లందు రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేశ్ రూ.51,07,777లకు దక్కించుకున్నాడు. అయితే, గతేడాది (2024లో) కూడా ఇక్కడి గణపయ్య లడ్డూను కొండపల్లి గణేశే రూ.29లక్షలకు దక్కించుకున్నాడు. అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నడింపల్లి నాని రాజు మాట్లాడుతూ.. వేలం నగదును బ్యాంక్​ డిపాజిట్‌ చేసి, దానిపై వచ్చే వడ్డీని వచ్చే సంవత్సరం గణేశ్​ ఉత్సవాల కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపారు.

Also Read: Bandlaguda Laddu Auction : రికార్డులన్నీ బ్రేక్.. బండ్లగూడ‌జాగీర్‌‌లో రికార్డు స్థాయి ధర పలికిన గణపతి లడ్డూ.. బాబోయ్.. అన్నికోట్లా..!