Ponguleti – Jupalli : ఆ తర్వాత మా అంచనాలు అన్నీ తప్పాయి: పొంగులేటి, జూపల్లి

అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు. జులై 2న ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

Ponguleti – Jupalli : ఆ తర్వాత మా అంచనాలు అన్నీ తప్పాయి: పొంగులేటి, జూపల్లి

Ponguleti Srinivas Reddy, Jupally Krishna Rao, Revanth Reddy

Updated On : June 26, 2023 / 6:29 PM IST

Ponguleti – Jupalli : తెలంగాణ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ (Congress) అగ్రనేతల సమక్షంలో జులై 2న ఆ పార్టీలో చేరనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) కార్యాలయంలో ఇవాళ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని వారిద్దరితో పాటు మరికొందరు నేతలు కలిశారు.

అనంతరం పొంగులేటి, జూపల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వస్తే ప్రజల కలలు నెరవేరతాయని అనుకున్నామని, అయితే రాష్ట్రాన్ని సాధించుకున్నాక కేసీఆర్ వల్ల తమ అంచనాలు అన్నీ తప్పాయని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ అనుకున్న అభివృద్ధి జరగలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

సీఎం కేసీఆర్ పాలన బాగోలేదని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు. జులై 2న ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బిడ్డలు ఏం కోరుకున్నారో అవి జరగలేదని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబ అవినీతి వల్ల ప్రజాలకు దక్కాల్సినవి దక్కడం లేదని అన్నారు. అనేక మోసపూరిత హామీలతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.

బీఆర్ఎస్‪ను వీడింది పదవులు ఇవ్వలేదని కాదని చెప్పారు. తమకు పదవులు అక్కర్లేదని అన్నారు. 3 సంస్థలు సర్వే చేస్తే 80% బీఆర్ఎస్‪కు వ్యతిరేకంగా ఉన్నారని తేలిందని చెప్పారు. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టాలనుకున్నామని, ఆ ఆలోచన విరమించుకున్నామని తెలిపారు. రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణపై మంచి ప్రభావం చూపించిందని చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‪కు రుణపడి ఉన్నారని తెలిపారు. ప్రజల గౌరవాన్ని నిలబెట్టాలనే కాంగ్రెస్‪లో చేరుతున్నామని అన్నారు. బీఆర్ఎస్‪ను తలదన్నేలా ఖమ్మం కాంగ్రెస్ సభ ఉంటుందని చెప్పారు.

భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు: జూపల్లి

ఎప్పటికప్పుడు కొత్త పథకాల పేర్లు చెబుతూ సీఎం కేసీఆర్ గిమ్మిక్కులు చేస్తున్నారని జూపల్లి కృష్ణారావు అన్నారు. కేసీఆర్ పాలన అంతా బోగస్ పథకాలు, బోగస్ మాటలతో కొనసాగుతోందని చెప్పారు. ప్రశ్నించేవారు ఎవరూ ఉండకూడదని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. భారీగా డబ్బు ఖర్చు చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు.

తాము అప్పట్లో పదువులు వదులుకుని ఉద్యమంలో పాల్గొన్నామని తెలంగాణ వచ్చాక ప్రజల బతుకులు బాగుపడతాయనుకున్నామని తెలిపారు. కేసీఆర్ వల్ల ప్రజల కలలు నెరవేరలేదని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ కాలరాస్తున్నారని, ప్రశ్నించే గొంతును నొక్కుతున్నారని ఆరోపించారు.

BHAAG SAALE Trailer : తెలంగాణ అంటే కేసీఆర్‌కు ఎంతిష్ట‌మో.. నువ్వంటే అంత ఇష్టం