Priyanka Gandhi (Photo Credit : Google)
Akkineni Amala : మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల షాక్‌కు గురైన సినీ హిరో అక్కినేని నాగార్జున సతీమణి అమలకు.. గురువారం ఉదయం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. బాధ్యతగల మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తమ కుటుంబ గౌరవాన్ని మంటగలిపారని ఈ సందర్భంగా ప్రియాంకతో అమల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. జరిగిన సంఘటనకు తాము చింతిస్తున్నామని, దీనిపై తగిన చర్య తీసుకుంటామని అమలను ప్రియాంకగాంధీ బుజ్జగించినట్టు తెలుస్తోంది.
Also Read : మీ కళ్లు చల్లబడతాయంటే మా ఇళ్లను కూలగొట్టండి- సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్
మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ.. నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరిగింది. యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఏకమై.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. తమ స్వార్ధ రాజకీయాల కోసం ఓ కుటుంబంపై నిందలు వేయడం కరెక్ట్ కాదంటున్నారు.
తన ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై అక్కినేని అమల తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలు విని షాక్ కి గురయ్యాను అని అన్నారు. రాజకీయ వివాదాల్లో తమను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. తన భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. రాజకీయ నాయకులే నేరస్తుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుందని అమల వాపోయారు.
మరోవైపు సమంత విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నాగార్జున చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మంత్రి తన కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దావాలో పేర్కొన్నారు నాగార్జున.