వ్యవసాయం చేసి నష్టపోయి.. ఈ అక్రమ దారిలో వెళ్లి రూ.కోట్లు సంపాదించి..

గంజాయి మార్కెట్ రేటు ప్రకారం 13.1 కిలోల హాష్‌ ఆయిల్‌ విలువ సుమారు 11 కోట్ల వరకు ఉంటుందని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు.

కొద్ది కాలం పాటు..వ్యవసాయం చేశారు. నష్టపోయారు. కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా అయినా చేతికిరాలేదు. లాభం లేదనుకున్నారు. కొత్త వ్యాపారంలోకి దిగారు. ఈ సారి కాసుల పంటలు పండాయి. రూ.లక్షల్లో కాదు.. రూ.కోట్లల్లో లాభాలొచ్చాయి. అబ్బ…ఇదేదో బాగుందే..ఏ వ్యాపారమో చెప్తే చేసేద్దాం అనుకుంటున్నారా..? చెప్పేస్తున్నా..ఆ వ్యాపారం..గంజాయి వ్యాపారం. అవును గంజాయి వ్యాపారమే..!

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం జిల్లా మాడ్గుల మండలంలోని ఆల్గం గ్రామానికి చెందిన కొండబాబు, బాలకృష్ణ అన్నదమ్ములు. వీరి జీవనాధారం వ్యవసాయం. అయితే వ్యయసాయం వల్ల నష్టపోయారు. పెట్టుబడి ఖర్చులు కూడా మిగిలేవి కావు. దీంతో కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టారు. గంజాయితో తయారయ్యే హ్యాష్‌ ఆయిల్‌ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ఇక వారి వ్యాపారం మూడు పూవులు..ఆరు కాయలు అన్నట్లు సాగింది.

హ్యాష్‌ అయిల్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉండటంతో ఈ ఆయిల్‌ను కొండబాబు, బాలకృష్ణలే తయారు చేస్తున్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి సుమారు కోటీ 80 లక్షల విలువైన 13.1 కిలోల హ్యాష్‌ ఆయిల్‌ను తయారు చేశారు. అలా తయారు చేసిన ఆయిల్‌ను బెంగుళూరులో విక్రయించేందుకు తమ గ్రామం నుండి బయల్దేరారు. కానీ అనుకోని విధంగా పోలీసులకు చిక్కారు.

కోట్లాది రూపాయల వ్యాపారం
వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో వ్యవసాయాన్ని పక్కనపెట్టిన కొండబాబు, బాలకృష్ణ మత్తు దందాలోకి దిగారు. మొదట్లో ఇద్దరు కలిసి తక్కువ ధరకు హ్యాష్ ఆయిల్‌ను సేకరించి, అధిక ధరలకు విక్రయించే వారు. కాలక్రమేణా హాష్ ఆయిల్ తయారీదారులు, సరఫరాదారులు అన్నీ వీరే అయ్యారు. ఏపీలో గంజాయి సాగు చేసే ప్రాంతాల్లో సరకును సేకరించి, గంజాయితో పాటు వివిధ కెమికల్స్ వేసి మరిగించి, ఈ హాష్‌ ఆయిల్‌ తయారు చేస్తున్నారు.

అయితే లీటరు హాష్ ఆయిల్ తయారీకి నిందితులు 40 కేజీల గంజాయిని వాడారన్న పోలీసులు, 13.1 కిలోల హాష్‌ ఆయిల్ తయారీకి దాదాపు 600 కేజీల గంజాయిని వినియోగించినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని చిన్న చిన్న బాటిళ్లలో ప్యాకింగ్‌ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో గంజాయి మార్కెట్ రేటు ప్రకారం 13.1 కిలోల హాష్‌ ఆయిల్‌ విలువ సుమారు 11 కోట్ల వరకు ఉంటుందని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు.

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి 14 కిలోల హాష్ ఆయిల్‌ కోసం ఆర్డర్‌ ఇవ్వగా, విశాఖ నుంచి నిందితులు హైదరాబాద్‌ మీదుగా బెంగళూరు తరలించేందుకు యత్నించారు. పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ వద్ద నిందితులు ఓ వ్యక్తికి హాష్‌ ఆయిల్‌ ఇచ్చేందుకు చూస్తుండగా, విశ్వసనీయ సమాచారంతో పోలీసులు డ్రగ్ పెడ్లర్లిద్దరినీ అరెస్టు చేశారు. డ్రగ్స్ తీసుకునేందుకు వచ్చిన వారు పరారీలో ఉన్నారు.

Also Read: క్వార్టర్ రూ.100లోపే..! మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..!

ట్రెండింగ్ వార్తలు