ఫోన్ ట్యాపింగ్ కేసులో నేనే మొదటి బాధితుడిని: రఘునందన్ రావు

Raghunandan Rao: కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తి లేదని అన్నారు.

Raghunandan Rao: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తానే మొదటి బాధితుడినని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని తాను గతంలోనూ చెప్పానని తెలిపారు. గత ప్రభుత్వం తన ఫోన్ టాప్ చేయించిందని డీజీపీకి ఆయన బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో జరిగిన దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేశారని తెలిపారు. సబితా ఇంద్రా రెడ్డిపై పోటీ చేసిన వారి నెంబర్ కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తి లేదని అన్నారు.

కేసులో కేసీఆర్ తో పాటు దుబ్బాక ఎన్నికల ఇన్‌చార్జ్ గా ఉన్న హరీశ్ రావు, అలాగే కలెక్టర్ ను ముద్దాయిలుగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ డివైస్ లను ఎవరు కొనుగోలు చేశారని నిలదీశారు. ఈ కేసులో విచారణ నిష్పక్ష పాతంగా జరగాలని డీజీపీని కోరానని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కొత్త భవనానికి శంకుస్థాపన చేయడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఇవాళ హైదరాబాద్ వస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఆయనకు చెప్పాలని అన్నారు. సినిమా పరిశ్రమలలో ఉన్న వారితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేసి బెదిరింపులు చేసి డబ్బులు వసూలు చేశారని చెప్పారు.

Also Read: వాలంటీర్ల జీతాలు పెంచుతామని చంద్రబాబు అంటున్నారు.. కానీ, ఏం చేస్తారో తెలుసా?: కొడాలి నాని

ట్రెండింగ్ వార్తలు