Rahul Gandhi
Assembly Elections 2023: ఉద్యోగాలు, రూ.లక్ష హామీలను బీఆర్ఎస్ నెరవేర్చిందా అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని చెప్పారు. ఇవాళ కాంగ్రెస్ ములుగులో నిర్వహించిక బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చి మోసం చేశారని రాహుల్ గాంధీ అన్నారు. ఇంటింటికీ ఉద్యోగాలిస్తామని కేసీఆర్ మోసం చేసి పాలన చేస్తున్నారని తెలిపారు. అభయ హస్తం పెన్షను పెంచి రూ.4 వేలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని తెలిపారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఐదు హామీలను నెరవేర్చామని చెప్పారు. ధరణి పోర్టల్‌లో అవినీతి జరిగిందని ఆరోపించారు. అందుకే రద్దు చేస్తామని చెప్పామని అన్నారు.
కేసీఆర్ హామీ ఇచ్చినట్లు మూడెకరాల భూమిని కూడా ఇవ్వలేదని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పాలన చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిందని, అయితే, ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా పాలన జరుగుతోందని అన్నారు.
రాజకీయ పార్టీలు తమకు నష్టం జరిగే నిర్ణయాలు తీసుకోవని, తెలంగాణ విషయంలో అలాంటి ఆలోచన చేయకుండా ప్రజల సంక్షేమం గురించి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ గౌరవించి తెలంగాణ ఇచ్చిందని తెలిపారు. పోడు భూములైనా, అసైన్డ్ భూములైనా లబ్ధిదారులకు హక్కు కల్పిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
Telangana BJP : 40మందితో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం..! రేపు రాత్రికి రిలీజ్?