Rain Alert: రాష్ట్రంలో నాలుగు రోజులు వానలేవానలు.. ఆ జిల్లాలకు అలర్ట్ జారీ..
రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Rain Alert
Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, ఇంటీరియల్ కర్నాటక, కేరళ మీదుగా ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
హైదరాబాద్ మహా నగరంలో నాలుగు రోజులుపాటు మబ్బులు పట్టి ఉంటుందని, మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మినహా పగటి ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా.. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో వచ్చే నాలుగు రోజులు మోస్తరు వర్షాలు పడుతాయని పేర్కొంది.
రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం జగిత్యాల, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో 44డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే నాలుగు రోజులు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 44డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.