తెలంగాణలో 3 నెలల విరామం తర్వాత మొదలైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్​

  • Publish Date - December 15, 2020 / 07:44 AM IST

Registration of non-agricultural assets in Telangana : తెలంగాణలో మూడు నెలల విరామం తర్వాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ అయింది. తొలిరోజు మొత్తం 82 వ్యవసాయేతర భూములకు రిజిస్ట్రేషన్‌ చేశారు. మొత్తం 103మంది స్లాట్‌బుక్‌ చేసుకోగా.. వివిధ కారణాల రీత్యా…15మంది రిజిస్ట్రేషన్ల కోసం రాలేదు. ఇక ఇవాళ్టి కోసం 155మంది స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు.

ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మొదలైనప్పటికీ… ఇదే విధానంలో వ్యవసాయేతర భూములు,ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కొన్ని కేసులు పెండింగ్‌లో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభించింది.. ఇందుకోసం మూడు రోజుల నుంచి రిజిస్ట్రేషన్​ శాఖ కసరత్తు చేసింది.. స్లాట్‌ బుకింగ్‌ ద్వారా రిజిస్ట్రేషన్ విధానం అమలులోకి వచ్చినందున.. ముందస్తుగా బుక్‌ చేసుకున్న వారికి ఆన్‌లైన్‌ ద్వారా సంబంధిత సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల నుంచి సమాచారం ఇచ్చారు.

మొదటి రోజు అమావాస్య కావడం వల్ల బుకింగ్​లు తక్కువగా అయ్యాయి.. మంగళవారం నుంచి బుకింగ్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్‌ పూర్తికాగానే మొదట ఈ-పాస్‌బుక్‌ ఇచ్చి… మరో వారం, పది రోజుల్లో పట్టాదారు పాసు పుస్తకాల మాదిరిగా వ్యవసాయేతర ఆస్తులకు ప్రత్యేకంగా మెరూన్‌ రంగులో పాస్‌ పుస్తకం ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఒకేసారి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్​, ఈ-పాసుపుస్తకం అందజేయనున్నారు..

అయితే పలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సర్వర్లు మొరాయించడంతో స్లాట్‌ బుక్‌ చేసుకున్న కొనుగోలుదారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం పాత విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రకటన చేసినా కొత్త పద్దతిలో రిజిస్ట్రేషన్‌ చేస్తుండటం పలు వివాదాలకు దారితీసింది.

అయితే మొదటి రోజు కావడంతో వినియోగదారులకు అనేక సందేహాలు వస్తున్నాయని.. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని అధికారులు అంటున్నారు. మొత్తానికి తొలి రోజు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై మిశ్రమ స్పందన వచ్చింది.. కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న టెక్నికల్‌ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామంటున్నారు.