Rent Boyfriend Scam : అమ్మాయిలూ.. ‘రెంట్ బాయ్‌ఫ్రెండ్’ ఆఫర్లకు పడిపోకండి.. సీపీ సజ్జనర్ హెచ్చరిక!
Rent Boyfriend Scam : సోషల్ మీడియాలో అమ్మాయిలను ఆకర్షించే పోస్టులపై హైదరాబాద్ నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ తరహా సైబర్ మోసాల వలలో అమ్మాయిలు పడొద్దని హెచ్చరిస్తున్నారు.
Rent Boyfriend Scam ( Image Credit : AI )
- రూ.499కే డేట్ అంటూ సైబర్ కేటుగాళ్ల కొత్త వల
- రెంట్ బాయ్‌ఫ్రెండ్, పర్సనల్ కంపానియన్ పేరుతో కొత్త మోసాలు
- ‘ఎక్స్’ వేదికగా పోస్టుతో నగర కమిషనర్ సజ్జనర్ హెచ్చరిక
Rent Boyfriend Scam : ఒంటరితనం వేధిస్తోందా? మీరు సరైన పార్టనర్ లేదా బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నారా? అయితే, మీకు మంచి టైమ్ పాస్ అయ్యేలా బోర్ ఫీల్ కాకుండా అందమైన బాయ్ ఫ్రెండ్ సెట్ చేసి పెడతాం.. మీతో కాఫీ తాగొచ్చు.. హాయిగా సినిమాలకు వెళ్లొచ్చు.. మీకు కావాలంటే 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ రెడీగా ఉంది. ఇలాంటి ఆఫర్లు చూసి టెంప్ట్ అవ్వొద్దు.. ఇదో పెద్ద సైబర్ డేటింగ్ ట్రాప్.. ప్రత్యేకంగా అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు.
సోషల్ మీడియాలో కనిపించే ప్రతి అట్రాక్టివ్ ఆఫర్ నిజం కాదు. ఇప్పుడు రెంట్ బాయ్‌ఫ్రెండ్, ‘పర్సనల్ కంపానియన్’ పేరుతో కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. అందమైన యువకుల ఫొటోలు, భారీ డిస్కౌంట్లతో పోస్టర్లు పెట్టి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారంటూ హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ ‘ఎక్స్’ వేదికగా పోస్టుతో ప్రజలను అప్రమత్తం చేశారు. సైబర్ మోసాల తీరుతో పాటు పోలీసులు తీసుకుంటున్న చర్యలతో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సజ్జనర్ వివరించారు.
అమ్మాయిలూ.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వల.. జాగ్రత్త!!
“ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50 శాతం ఆఫర్లతో!”.. సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్ల పేరుతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనుక పెద్ద సైబర్ మోసం దాగి ఉంది.… pic.twitter.com/E7O1mgwUip
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) August 8, 2026
రూ.499కే డేట్.. ఇదో సైబర్ ట్రాప్ :
ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో 50 శాతం ఆఫర్, స్పెషల్ ఆఫర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. గంటపాటు కాఫీ మీటింగ్‌కు రూ.499, సినిమా డేట్‌కు రూ.1,249, షాపింగ్‌కు రూ.1,499, ఈవెంట్లు, పెళ్లిళ్లకు రూ.1,999, ఫుల్డే ప్యాకేజీకి రూ.4,499 అంటూ రేట్లు పెట్టి ఆశపుట్టిస్తున్నారు.
ఎవరైనా ఈ పోస్టులను చూసి ఆసక్తితో మెసేజ్ చేస్తే అసలు మోసం అక్కడే బిగిన్ అవుతుంది. ఇవన్నీ ఏఐతో జనరేట్ చేసినా లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన యువకుల ఫొటోలతో నమ్మించే ప్రయత్నం చేస్తారు. అనంతరం బుకింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ పేరుతో క్యూఆర్ కోడ్లు, డిజిటల్ పేమెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తారు. ఆఫై మీ అకౌంట్లు బ్లాక్ చేస్తారు.
డబ్బులతో ఆగదు.. బ్లాక్‌మెయిలింగ్ రిస్క్ :
చాటింగ్ సమయంలో మీ దగ్గర సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత వివరాలు, ఫొటోలతో తర్వాత బెదిరింపులకు లేదా బ్లాక్మెయిల్ చేసే రిస్క్ ఉంటుంది. ఆన్లైన్లో పరిచయమైన అపరిచితులను నేరుగా కలవడం చాలా ప్రమాదకరం. ఇలాంటి విషయంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
అమ్మాయిలూ.. వెంటనే అలర్ట్ అవ్వండి :
అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయండి. మీరు మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి. అలాగే, భారత ప్రభుత్వ అధికారిక (National Cyber Crime Reporting Portal)లో ఫిర్యాదు చేయండి.
డబ్బులు పంపినట్లయితే ట్రాన్సాక్షన్ వివరాలు, స్క్రీన్షాట్లు, ఫోన్ నంబర్లు, చాటింగ్ వంటి ఆధారాలను కూడా దగ్గర పెట్టుకోండి. గుర్తుతెలియని వారితో పర్సనల్ చాటింగ్ చేయొద్దు. పర్సనల్ ఫొటోలు, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి షేర్ చేయొద్దు.
బుకింగ్, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో ముందుగానే డబ్బులు ఇవ్వొద్దు. ఆన్లైన్లో పరిచయమైన అపరిచిత వ్యక్తిని ఒంటరిగా వెళ్లి అసలు కలవద్దు. రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో 50 శాతం ఆఫర్ కనిపించినా ముందు నిజానిజాలు చెక్ చేయండి. డిస్కౌంట్ చూసి టెంప్ట్ అవ్వొద్దు. మీరు చేసే ఒక చిన్న పొరపాటు భారీ సైబర్ మోసానికి దారితీయొచ్చని హైదరాబాద్ పోలీసులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
