×
Ad

ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం..!?

జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇప్పట్లో జరిగే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సందిగ్ధంలో సర్కార్
  • మూడంచెల వ్యవస్థను తెచ్చేలా చట్టంలో మార్పులు?
  • సర్పంచులతో ఎంపీపీలు.. ఎంపీపీలతో జడ్పీ ఛైర్మన్ల ఎన్నిక..!
  • జీహెచ్ఎంసీ ఎన్నికలకు అడ్డంకిగా మారిన కోర్టు కేసులు

Telangana: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో అధికార పార్టీనే పైచేయి సాధిస్తూ వస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ఆ తర్వాత జూబ్లీహిల్స్ బైఎలక్షన్స్లో గెలిచి హస్తం పార్టీ మంచి జోష్ నింపింది. ఇదే ఉత్సాహంలో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించి మెజార్టీ పంచాయితీలను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. లేటెస్ట్గా మున్సిపల్ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ అత్యధిక స్థానాలను గెలిచి సత్తా చాటింది.

ఈ క్రమంలో ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలపైనే రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలపై సర్కార్ సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐదు అంచెల వ్యవస్థను మూడంచెల వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకు ఎంపీటీసీలను, జడ్పీటీసీలను నేరుగా ప్రజలే ఎన్నుకునే వాళ్లు. కానీ ఇప్పుడు పరోక్షంగా ఎంపీపీలను, జడ్పీ ఛైర్మన్లను ఎన్నుకునేలా చట్టంలో మార్పులు చేర్పులు చేసే యోచనలో ఉన్నారట. ఎంపీపీలను సర్పంచులు ఎన్నుకుంటే, ఎంపీపీలు జడ్పీ ఛైర్మన్లను ఎన్నుకునేలా చట్ట సవరణ చేస్తారని అంటున్నారు.

Also Read: అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు..! కేసు కీలక టర్న్?

ఎంపీటీసీలు, జడ్పీటీసీ వ్యవస్థతో ప్రజలకు, ప్రభుత్వానికి పెద్దగా లాభమేమి లేదని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ ఖర్చుతో పాటు వారికి జీతభత్యాలు, మిగతా ఖర్చుల భారం అవుతుందని..పైగా ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలే తప్ప వారికి పెద్దగా అధికారాలు ఏమీ లేవు. అందుకే ఈ ఐదంచెల వ్యవస్థను మూడంచెలకు కుదించి పరోక్ష ఎన్నికలకు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందట.

అధికార పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయ్?
ఎలాగూ మెజార్టీ పంచాయితీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కాబట్టి.. సర్పంచుల ద్వారా ఎంపీపీలను, ఎంపీపీలతో జడ్పీ ఛైర్మన్లను గెలుచుకోవచ్చని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టాలనుకున్నప్పటికీ న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయట. ప్రస్తుత కౌన్సిల్ గడువు ఫిబ్రవరి 10వ తేదీతో ముగియడంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భావించినా అందుకు కోర్టు కేసులు అడ్డుపడుతున్నాయి.

హైదరాబాద్ శివార్లలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో పాటు వార్డుల సంఖ్యను 300కు పెంచడంపై వివాదం నడుస్తోంది. వార్డుల విభజన శాస్త్రీయంగా లేదని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్లపై కోర్టు విచారణ జరుపుతోంది. దీంతో కోర్టు కేసులుకు సంబందించి క్లారిటీ వచ్చేవరకు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని అంటున్నారు. మరోవైపు జనగణనకు నోటిఫికేషన్వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామాలు, వార్డుల విభజన చేయకూడదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు.

నిబంధనలకు వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ విభజన నోటిఫికేషన్‌ ఇచ్చారని, అందుకని జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించలేరని ఆయన చెబుతున్నారు. జనగణన నోటిఫికేషన్ వచ్చాక వార్డుల విభజన జరగడంతో సాంకేతిక సమస్యలతో పాటు కోర్టు వివాదాల పరిష్కారానికి కనీసం ఏడాది కాలమైన పట్టే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఇటు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇప్పట్లో జరిగే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను ఉంచాలా.? మూడంచెల వ్యవస్థను తీసుకురావాలా.? అనేదానిపై 23న జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.