Revanth Reddy: పొంగులేటి, జూపల్లితో భేటీకానున్న రేవంత్.. కాంగ్రెస్‌లో చేరిక, పలు అంశాలపై చర్చ

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం పొంగులేటి, జూపల్లితో భేటీ కానున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీలో చేరిక, వారివెంట ఎవరెవరు వస్తారనే అంశాలపై చర్చించనున్నారు.

Jupalli- Revanth Reddy- Ponguleti

Revanth Reddy- Ponguleti: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) లు త్వరలో కాంగ్రెస్ పార్టీ (C0ngress Party) లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party)నుంచి బయటకు వచ్చిన తరువాత వారిద్దరూ ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వరకు వారు బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ, చివరికి వారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వచ్చే నెల మొదటి వారంలో వారు భారీ బహిరంగ సభ వేదిక ద్వారా కాంగ్రెస్ లో చేరుతారని సమాచారం.

Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం : రేవంత్ రెడ్డి

పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయం కావటంతో ఇరువురి నేతలతో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)  భేటీ కానున్నారు. బుధవారం మధ్యాహ్నం 1గంటల సమయంలో రేవంత్ రెడ్డి జూపల్లి కృష్ణారావు నివాసంకు వెళ్తారు. అక్కడి నుండి జూపల్లి, రేవంత్ ఇద్దరుకలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి చేరుకోనున్నారు. ముగ్గురు నేతలు కలిసి అక్కడ మధ్యాహ్నం లంచ్ చేసి ఆ తరువాత కాంగ్రెస్ లో చేరిక, పలు అంశాలపై చర్చించనున్నారు.

Ponguleti Srinivasa Reddy : కాంగ్రెస్‌లోకి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

పొంగులేటి, జూపల్లితో పాటు కాంగ్రెస్ పార్టీలోకి ఏఏ నేతలు వస్తారనేదానిపై రేవంత్ రెడ్డి ఇరువురి నేతలతో చర్చించనున్నారు. అయితే, ఢిల్లీ వెళ్లి ఒకసారి అధిష్టానం పెద్దలను కలవాలని పొంగులేటి, జూపల్లి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వీరు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఆ భేటీకి సంబంధించిన అపాయింట్ మెంట్ ఖరారైన తరువాత వారు ఢిల్లీ వెళ్తనున్నారు. తాజాగా ముగ్గురు నేతల భేటీలో ఢిల్లీ టూర్‌తో పాటు, కాంగ్రెస్‌లో చేరే తేదీపై కూడా ఓ స్పష్టత వస్తుందని సమాచారం. అయితే, ముగ్గురు నేతలు భేటీ తరువాత మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటిస్తారా? రాహుల్‌తో భేటీ తరువాతనే వారు ఈ ప్రకటన చేస్తారా? అనే అంశం ఆసక్తికరంగా మారింది.