హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో రాయల్ బెంగాల్ టైగర్ మృతి

  • Published By: bheemraj ,Published On : July 5, 2020 / 11:52 PM IST
హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో రాయల్ బెంగాల్ టైగర్ మృతి

Updated On : July 6, 2020 / 6:50 AM IST

హైదరాబాద్ నెహ్రరూ జూ పార్క్ లో మరో పులి మృత్యువాత పడింది. పదకొండేళ్ల రాయల్ బెంగాల్ టైగర్ కదంబ మృతి చెందింది. శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్టు జూపార్క్‌ అధికారులు తెలిపారు. కర్ణాటకలోని మంగళూరు పిలుకుల బయోలాజికల్‌ పార్కు నుంచి జంతువుల మార్పిడి పథకం కింద కదంబను 2014 మార్చి 3న హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ కు తీసుకొచ్చారు. ఈ టైగర్ గత వారం, పది రోజులుగా మధ్య మధ్యలో ఆహారం మానివేసింది. అస్వస్థతకు గురైన పులి గుండెపోటుతో మరణించినట్లు జూపార్క్ అధికారులు తెలిపారు. గత నెల 25న కిరణ్ అనే 8 సంవత్సరాల బెంగాల్ టైగర్ మృతి చెందింది.

కదంబ మరణం తర్వాత నెహ్రు జూలాజికల్‌ పార్కులో ప్రస్తుతం మొత్తం 20 రాయల్‌ బెంగాల్‌ టైగర్లున్నాయి. వాటిలో పసుపు రంగువి 11 (పెద్దవి–8, చిన్నవి–3), తెలుపురంగువి 9 ( అన్ని పెద్దవే) ఉన్నాయని క్యూరెటర్‌ క్షితిజ తెలిపారు. ఈ పులుల్లో పసుపు రంగు రాయల్‌ బెంగాల్‌ టైగర్లు రోజా (21 ఏళ్లు), సోని (21 ఏళ్లు), అపర్ణ (19 ఏళ్లు) ఇప్పటికే తమ సగటు జీవితకాలాన్ని మించిపోయాయని ఆమె తెలిపారు.

కాగా, పది రోజుల వ్యవధిలో జూపార్క్‌లో పులి చనిపోవడం ఇది రెండవది. జూన్ 25 రాయల్‌ బెంగాల్‌ వైట్‌ టైగర్‌(కిరణ-8) కుడివైపు దవడ భాగంలో ఏర్పడిన న్యూయో ప్లాస్టిక్‌ కణతితో బాధపడుతూ మృతి చెందింది.