Muchintal : ముచ్చింతల్‌లో ఆధ్యాత్మిక వాతావరణం.. ఉత్సవాల్లో పాల్గొననున్న ఆర్ఎస్ఎస్ చీఫ్
ముచ్చింతల్ లో ఆధ్మాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. శ్రీరామనగరం భక్తజనంతో నిండిపోయింది...
RSS Chief Mohan Bhagwat : శంషాబాద్ కు సమీపంలో ఉన్న ముచ్చింతల్ లో ఆధ్మాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. శ్రీరామనగరం భక్తజనంతో నిండిపోయింది. జై శ్రీమన్నారాయణ అంటూ జయజయ ద్వానాలు చేస్తున్నారు. 216 అడుగుల భగవద్రామానుజ చార్యుల విగ్రహాన్ని దర్శించుకుని మైమరిసిపోతున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఈ మహాక్రతువు కొనసాగుతోంది. 5 వేల మంది రుత్విజులు యాగశాలలో హోమాలను నిర్వహిస్తున్నారు.
114 యాగశాలల్లో 1035 హోమ గుండాల్లో పారాయణల మధ్య ఘనంగా హోమాలను నిర్వహిస్తున్నారు. 2022, ఫిబ్రవరి 09వ తేదీ బుధవారం ఎనిమిదో రోజు పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇప్పటికే 108 దివ్య దేశాల్లో ఆలయాల్లో ప్రాణప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే. ఈ మహా క్రతువును చూసేందుకు పలువురు ప్రముఖులు విచ్చేస్తున్నారు. రాజకీయ, సినీ, వివిధ రంగాలకు చెందిన వారు ఇక్కడకు విచ్చేస్తున్నారు. మంగళవారం కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చారు. 2022, ఫిబ్రవరి 09వ తేదీ బుధవారం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.30 కి ముచ్చింతల్ కు ఆయన రానున్నారు. రాత్రి 8 గంటల వరకు వివిధ కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొంటారు. ప్రవచన మండపంలో జరిగే ధర్మాచార్య సభలో పాల్గొన్న అనంతరం ఆయన ప్రసంగించనున్నారు.