UP polls 2022: ఉత్తరప్రదేశ్లో పోలింగ్ రేపే.. 5 చక్రవ్యూహాలు ఇవే!
దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ రేపు జరగబోతోంది.

Voting
UP polls 2022: దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ రేపు జరగబోతోంది. ఫిబ్రవరి 10న ఉత్తరప్రదేశ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఉండగా.. వివాదాస్పద ప్రకటనల నుంచి కుల సమీకరణాల వరకు ప్రతీదాన్ని సరిదిద్దడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
మొదటి దశలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ ఉత్తరప్రదేశ్.. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉంది. పశ్చిమ యూపీలో మొత్తం 136 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఈ భాగమే రాష్ట్రానికి అధికారాన్ని తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లోని 58 స్థానాలకు ఫిబ్రవరి 10న పోలింగ్ జరగనుంది. ఏ పార్టీకి ఎన్నికల గాలి వీస్తుందో తొలి రౌండ్ నుంచే తెలిసిపోతుంది.
మొదటి విడతలో 58 నియోజకవర్గాల్లో 2.17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 58 అసెంబ్లీ స్థానాల కోసం 500 మందికి పైగా వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో విడత పోలింగ్ ఈ నెల 14వ తేదీన జరగబోతోంది.
వివాదాస్పద ప్రకటనలు, వలసలు, రైతులు, కులం, మతం అనే ఐదు చక్రవ్యూహాలను దాటుకుని ఓట్లను రప్పించుకున్న పార్టీనే ఇక్కడ అధికారం దక్కించుకుంటుంది అనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఐదు అంశాలే యూపీలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారతీయ జనతా పార్టీ 2017లో తిరుగులేని విజయం దక్కించుకుని కనీవినీ ఎరుగని మెజారిటీతో.. మొత్తం 408 స్థానాల్లో 312 సీట్లను కైవసం చేసుకుని అధికారం దక్కించుకుంది. ఇప్పుడు కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది బీజేపీ.
బీజేపీకి ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యమైన స్థానం.. ఎందుకంటే, యూపీలో గెలవకపోతే 2024లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎదురుగాలి వీచే అవకాశం ఉంది. 80 లోక్సభ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ దేశరాజకీయాల్లో కూడా కీలకంగా ఉంటుంది.