సంక్రాంతి సెలవులు కుదింపు

సంక్రాంతి సెలవులు కుదింపు

Updated On : January 8, 2020 / 11:05 PM IST

పాఠశాల విద్యా శాఖ సంక్రాంతి సెలవులను కుదించింది. పాఠశాల విద్యా అకడమిక్ కేలండర్ ప్రకారం ఈ నెల 11 నుంచి 16వరకూ సెలవులను ప్రకటించినప్పటికీ ఈ నెల 12న ఆదివారం కావడంతో ఈ నెల 13నుంచి 16వరకూ సెలవులను ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. అలాగే వచ్చే ఏప్రిల్ వరకూ ప్రతి నెల రెండో శనివారం పాఠశాలలు పనిచేయాలని స్పష్టం చేసింది. 

రెండో శనివారం అయిన ఈ నెల 11, ఫిబ్రవరి 8, మార్చి 14, ఏప్రిల్ 11తేదీల్లో పాఠశాలలకు సెలవులు వర్తించవమని.. ఆ తేదీల్లో పనిచేయాల్సిందేనని వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ విజయ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ సమ్మె కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చినందును వాటిని సర్దు బాటు చేసేందుకు రెండో శనివారం అన్ని పాఠశాలలు పనిచేయాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. 

కాగా, పాఠశాల విద్యాశాఖ నిర్ణయం పట్ల ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. యథావిధిగా సెలవులు వస్తాయని అనుకున్న వారికి నిరాశే మిగలడంతో అసంతృప్తితో ఉన్నాయి. 

జూనియర్ కాలేజీలకు 13నుంచి..
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కోర్సును నిర్వహించే కాంపొజిట్ డిగ్రీ కాలేజీలకు ఈ నెల 13నుంచి 15వరకూ సంక్రాంతి సెలవులుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది.