ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి సీల్

చారిత్రాత్మకమైన ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి సీల్ పడింది. నిజాం కాలంలో నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. పెచ్చులూడుతూ ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షానికి ఆస్పత్రిలోకి భారీగా నీరు చేరిన విషయం తెలిసిందే. దీంతో పాతభవనాన్ని మొత్తం ఖాళీ చేసి, సీజ్ చేయాలని తెలంగాణ డీఎంఈ డాక్టర్ కే రమేశ్‌రెడ్డి బుధవారం (జులై 22, 2020) ఆదేశాలు జారీ చేశారు. పాతభవనంలో చికిత్స పొందుతున్న రోగులను ఇతర వార్డుల్లోకి తరలించారు. మరికొంతమంది రోగులను అదే ఆస్పత్రిలోని నూతన భవనంలోకి షిఫ్ట్ చేశారు. అందులో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించవద్దని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సూచించారు.
డీఎంఈ ఆదేశాల మేరకు భవనానికి తాళం వేసినట్టు, సూపరింటెండెంట్ చాంబర్ సహా నలుగురు విభాగాధిపతుల చాంబర్లను క్యూక్యూ, ఓపీ భవనాల్లోకి తరలించినట్టు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ పాండునాయక్ తెలిపారు. ప్రమాదకరంగా మారిన ఉస్మానియా పాతభవనాన్ని ఖాళీ చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు తెలంగాణ ప్రభుత్వ వైద్యులసంఘం అధ్యక్షుడు పుట్ల శ్రీనివాస్, డాక్టర్ల జేఏసీ చైర్మన్ డాక్టర్ బొంగు రమేశ్ ధన్యవాదాలు తెలిపారు. నాలుగురోజులుగా చేస్తున్న ఆందోళనను విరమిస్తున్నట్టు వారు ప్రకటించారు.
ఉస్మానియా ఆస్పత్రికి పాత భవనానికి వందేండ్లకుపైగా చరిత్ర ఉంది. గత పాలకుల సరైన పర్యవేక్షణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి దుస్థితిని స్వయంగా చూసిన ఆయన.. పాతభవనాన్ని తొలగించి రెండు టవర్లతో, అధునాతన హంగులతో కొత్త భవనం నిర్మిస్తామని ప్రకటించారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు, పలు సంఘాలు.. హెరిటేజ్ భవనం పేరిట పాతభవనాన్ని తొలగించకుండా, కొత్తదాన్ని నిర్మించకుండా కోర్టుల్లో కేసులు వేయడంతో కొత్త భవనం నిర్మాణ ప్రతిపాదన అడుగునపడిపోయింది.
భవనం మరింత శిథిలావస్థకు చేరుకోటమే కాకుండా.. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే వార్డుల్లోకి నీళ్లు చేరడంతో ఉస్మానియా దుస్థితి మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఆస్పత్రి నిర్వహణ, సమస్యలపై వైద్యరోగ్యశాఖ కమిటీ వేసి రిపోర్టు కూడా సిద్ధం చేసింది. పేషెంట్లను వివిధ వార్డులకు తరలించింది.