Secunderabad Railway Station
Secunderabad Railway Station : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. ఎందుకంటే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్ ఫామ్ నెంబర్-1 వద్ద ప్రయాణికుల కోసం ఉద్దేశించిన పార్కింగ్ సౌకర్యాన్ని తాత్కాలికంగా మూసేశారు. తక్కువ సమయంలో వాహన రాకపోకలను (పికప్, డ్రాప్) మాత్రమే అనుమతిస్తున్నారు. కొత్త పార్కింగ్ సదుపాయాన్ని ప్లాట్ ఫామ్ నెంబర్-10 వద్ద అందుబాటులోకి తీసుకొచ్చారు.
Also Read : Telangana Municipal Polls: మంత్రులకు మున్సిపోల్స్ టెన్షన్..! వారిని వెంటాడుతున్న కొత్త భయం ఏంటి?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను దాదాపు రూ.714.73 కోట్లతో పునరాభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 50శాతం పునరాభివృద్ధి పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మొత్తం ప్రాజెక్టును డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పునరాభివృద్ధి చెందిన స్టేషన్లో ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు, సదుపాయాలు కల్పించనున్నారు. స్టేషన్ పునరాభివృద్ధి పనుల దృష్ట్యా వాహనాల పార్కింగ్‌ను ప్లాట్‌ఫామ్ నంబర్ -10 వద్ద అందుబాటులో ఉంచారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్ ఫీజులు ఇలా..
♦ ఫోర్ వీలర్ వాహనం పార్కింగ్ కోసం మొదటి రెండు గంటలకు రూ.40, ఆ తరువాత గంటకు రూ.20 చొప్పున వసూలు చేస్తారు.
♦ మోటార్ సైకిల్, స్కూటర్, ద్విచక్ర వాహనానికి మొదటి రెండు గంటలకు రూ.25, తదుపరి గంటకు రూ.10 చొప్పున చెల్లించాలి.
♦ సైకిల్‌కు మొదటి రెండు గంటలకు రూ. 5. తదుపరి గంటకు రూ. 2 చెల్లించాలి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అనధికార పార్కింగ్, వాహనాల అడ్డంకులను నివారించడానికి యాక్సెస్ కంట్రోల్ సిస్టిమ్ అమలు చేస్తున్నారు. ఈ జోన్లోకి ప్రవేశించే ప్రయాణీకులకు 15 నిమిషాల వరకు ఉచిత పికప్, డ్రాప్ సౌకర్యం అధికారులు కల్పించారు. ఆ తరువాత అధీకృత పార్కింగ్ స్థలంలో పార్క్ చేయని వాహనాలపై అదనపు రుసుములు విధించనున్నారు.