Telangana Municipal Polls: మంత్రులకు మున్సిపోల్స్ టెన్షన్..! వారిని వెంటాడుతున్న కొత్త భయం ఏంటి?
పంచాయతీ ఎన్నికల్లో తక్కువ స్థానాలు వచ్చిన చోట పార్టీ నేతల తప్పిదాలపై సీఎం రేవంత్ బాధ్యులపై సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి మిస్టేక్ జరిగినా తమపై ఎఫెక్ట్ పడుతుందని మంత్రులు ఆందోళన చెందుతున్నారట.
Telangana Cabinet Representative Image (Image Credit To Original Source)
- మున్సిపల్ ఎన్నికల వేళ అమాత్యులకు టెన్షన్..
- వర్గపోరుకు చెక్ పెట్టేదెలా? టికెట్ల కేటాయింపు చేసేదెలా?
- కొత్త, పాత నేతలను కలిపేదెట్లా? విజయం సాధించేదెలా?
- ఇంచార్జ్ మంత్రులకు హెడెక్‌గా టికెట్ ఫైట్, వర్గపోరు..
Telangana Municipal Polls: పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాం. అసలే పట్టణ ప్రాంతాలు..నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు..మున్సిపోల్స్‌లో జెండా ఎగరేయాల్సిందే. ఇందుకోసం స్పెషల్ ప్లాన్ రెడీ చేసింది హస్తం పార్టీ. ఏకంగా అమాత్యులకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించింది. కానీ పురపోరు వేళ వర్గపోరు కాక రేపుతోంది. టికెట్ ఫైట్, వర్గపోరును చూసి హడలెత్తిపోతున్నారట ఇంచార్జ్ మంత్రులు. గాంధీభవన్ సాక్షిగా జరిగిన జగిత్యాల ఎపిసోడ్‌తో అమాత్యులు ఆలోచనలో పడిపోయారట. అభ్యర్థుల ఎంపిక బాధ్యత తమకొద్దంటూ తేల్చి చెప్తున్నారట.
మున్సిపల్ ఎన్నికలపై సీరియస్ ఫోకస్ పెట్టింది అధికార హస్తం పార్టీ. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడమే టార్గెట్‌గా పావులు కదుపుతోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల బాధ్యులను ప్రకటించింది పార్టీ. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న 15 పార్లమెంట్ నియోజకవర్గాలకు 15 మంది మంత్రులను ఇంచార్జ్‌లను నియమించారు సీఎం రేవంత్. నియోజకవర్గాల వారీగా మంత్రులు సన్నాహక సమావేశాలు పెట్టాలని సూచించారు ముఖ్యమంత్రి.
అయితే ఇంచార్జ్ మంత్రులకు అప్పుడే సెగ మొదలైంది. అధికార పార్టీ తరఫున పోటీ కోసం తీవ్రస్థాయిలో పోటీ ఉందని మంత్రుల దృష్టికి వచ్చింది. కొత్త, పాత కాంగ్రెస్ నేతలు టిక్కెట్ల కోసం వర్గాలుగా విడిపోయి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే గాంధీభవన్‌లో జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం రసాభాసాగా మారింది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వర్సెస్ మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మధ్య ఇప్పటికే ఉప్పు-నిప్పులా ఉన్న వ్యవహారం కాస్త..సన్నాహక సమావేశం సాక్షిగా మరోసారి దుమారం రేగింది.
సవాల్ గా మారిన అభ్యర్థుల ఎంపిక..
ఏకంగా సంజయ్ ఉన్న మీటింగ్‌కు తాను హాజరుకాబోనని సమావేశం నుంచి బయటికి వచ్చి రచ్చ చేశారు మాజీమంత్రి జీవన్‌రెడ్డి. ఈ పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపిక మంత్రులకు పెద్ద సవాల్‌గా మారింది. పోటీ చేయనున్న ప్రతి స్థానానికి ఆరుగురు పేర్లతో లిస్ట్ రెడీ చేయాలని మంత్రులను పీసీసీ చీఫ్, సీఎం ఆదేశించారు. అయితే ఒక్కో స్థానం నుంచి ఇరవై మందికిపైగా ఆశావహులు ఉండటంతో తలలు పట్టుకుంటున్నారు నేతలు.
మంత్రులకు పట్టుకున్న కొత్త భయం..!
మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గం, డీసీసీ అధ్యక్షుడి వర్గం, పీసీసీ వర్గం, ఇంచార్జ్ మంత్రి వర్గం, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మంత్రి వర్గం అంటూ డజన్ల మంది ఆశావహులు టికెట్ రేసులో ఉన్నారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా ఉంది. జగిత్యాల, పటాన్ చెరు, గద్వాల్, బాన్సువాడ వంటి చోట్ల ఎవరికి టికెట్ రాకపోయినా మిగతా వర్గాల వాళ్లతో కలిసి..పార్టీ టికెట్ ఇచ్చిన వారికి వ్యతిరేకంగా పనిచేసేలా క్లాషెస్ ఉన్నాయట. దీంతో మంత్రులకు కొత్త భయం పట్టుకుందట.
మంత్రులకు ఈ ఎన్నికలు డూ ఆర్ డై..!
పంచాయతీ ఎన్నికల్లో తక్కువ స్థానాలు వచ్చిన చోట పార్టీ నేతల తప్పిదాలపై సీఎం రేవంత్ బాధ్యులపై సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి మిస్టేక్ జరిగినా తమపై ఎఫెక్ట్ పడుతుందని మంత్రులు ఆందోళన చెందుతున్నారట. గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు..లోకల్ పోరులో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఇద్దరు మంత్రులు మారెప్ప, మాగంటి బాబులు రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ బాధ్యతలు తీసుకున్న మంత్రులకు ఈ ఎన్నికలు డూ ఆర్ డై అన్నట్లుగా మారాయట.
పార్టీ ఇచ్చిన టార్గెట్ రీచ్ అయ్యేందుకు కష్టపడి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ, టికెట్ కోరుతున్న ఆశావహుల సంఖ్యను చూసి నేతలందరూ తలలు పట్టుకుంటున్నారట. ఒక్కో స్థానానికి డజను మంది నేతలు టికెట్ కోసం ట్రై చేస్తుండటం..మరోవైపు గ్రూప్ వార్ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక అతిపెద్ద సమస్యగా మారిందట. ఇక టికెట్ ఎంపిక కోసం కమిటీ వేస్తున్నామని, అభ్యర్థుల ఎంపిక బాధ్యత పూర్తిగా కమిటీ చూసుకుంటుందని పీసీసీ చీఫ్ ప్రకటించారు. అయితే కొత్తగా ప్రకటించిన ఇంచార్జ్ మంత్రులు మాత్రం అభ్యర్థుల ఎంపిక తమతో కాదని చేతులెత్తేస్తునట్లు టాక్.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని హస్తం నేతలు భావిస్తున్నప్పటికీ ఆశావహుల పోటీ, గ్రూప్ తగాదాలు పార్టీకి నష్టంగా మారే ప్రమాదముందట. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ వల్లే హస్తం పార్టీ అనుకున్న టార్గెట్ ను రీచ్ కాలేదంటున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో వర్గపోరుకు చెక్ పెట్టి టికెట్ కేటాయింపులు ఎలా చేస్తుందో చూడాలి మరి.
Also Read: మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన కవిత.. మా మద్దతు వారికే..
