మహమ్మారి వెంటాడుతుంది, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి.. జాగ్రత్తగా ఉండాలి.. సంవృద్ధిగా వర్షాలు.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహాకాళి బోనాల్లో భాగంగా భక్తురాలు మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

Rangam Bhavishyavani 2025: సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా సాగుతున్నాయి. పలువురు ప్రముఖులు, భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించారు. బోనాల వేడుకలో భాగంగా సోమవారం భక్తురాలు మాతంగి స్వర్ణలత రంగం భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
బోనాల జాతరకు సంతోషంగా సాకలు పోసి బాగా చేశారు. ప్రతీసారి చేసినట్టే ఈసారి కూడా పొరపాటు చేశారు. ప్రతి సంవత్సరం చెబుతున్న.. నా బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాను. నా పూజలు అన్ని సక్రమంగా జరిపించాలి. వేల రాసులు నేను రప్పించుకుంటున్న. నాకు రక్తం బలి ఇవ్వడం లేదు. మీరు మాత్రం ఆరగిస్తారు.. నాకు మాత్రం ఇవ్వడం లేదు. నాకు సరిగ్గా పూజలు చెయ్యకపోతే రక్తం కక్కుకొని చస్తారు. నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదు. అందుకే మరణాలు పెరుగుతున్నాయి. నేను అస్సలు ఆ విషయంలో అడ్డుపడను. నాకు రక్తం బలి కావాలి. నన్ను కొలిచే వారికి నేను ఎప్పుడు తోడుగా నిలబడుతాను అని భవిష్యవాణి వినిపించారు.
రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది. ప్రజలు జాగ్రత్త ఉండాలి. అగ్ని ప్రమాదాలు బాగా జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురుస్తాయి. ఐదు వారాలు పాటు నాకు పూజలు, సాక పోసి ఆనంద పరచాలి. నాకు రక్తం చూపించండి లేకపోతే అల్లకల్లోలం జరుగుతుంది. నా రూపాన్ని పెట్టడానికి కూడా అడ్డుపడుతున్నారని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.