Operation Karraguttalu: తెలంగాణలోని కర్రెగుట్టలు రక్తసిక్తం అయ్యాయి. ఆపరేషన్ కగార్ లో భాగంగా సాయుధ బలగాలు చేపట్టిన కూంబింగ్ లో మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 20 నుంచి 22 మంది మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం.
Also Read: Operation Sindoor: ఇదిగో ఇందుకే.. భారత్ టార్గెట్ చేసి మరీ.. ఆ 9 ప్రాంతాల్లో ఎటాక్ చేసింది..
బుధవారం తెల్లవారుజాము నుంచి కర్రెగుట్టల్లో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ఢిల్లీ నుండి ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. అలాగే, ఛత్తీస్‌గఢ్ ఏడీజీ (నక్సల్ ఆపరేషన్స్) వివేకానంద్ సిన్హా, సీఆర్పీఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్, బస్తర్ ఐజీ పి.సుందర్‌రాజ్‌లు ప్రత్యక్షంగా ఆపరేషన్ కగార్ ను పర్యవేక్షిస్తున్నారు.
కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు లక్ష్యంగా భద్రతా దళాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. దీంతో గత పదిహేను రోజులుగా కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కాల్పుల మోత మోగిస్తున్నాయి. ఏప్రిల్ 27న జరిగిన ఎన్ కౌంటర్లో 30మందికిపైగా మావోలు మృతిచెందినట్లు సమాచారం. తాజాగా.. ఇవాళ ఉదయం మావోలు, భద్రతాదళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కర్రెగుట్టలను భద్రతాదళాలు చుట్టుముట్టడంతో మావోయిస్టులు శాంతి చర్చలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఏకపక్ష కాల్పులు జరపడం సరికాదని, కాల్పులు విరమించి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. పౌరహక్కుల సంఘాలు గత కొన్నిరోజులుగా ‘ఆపరేషన్ కర్రెగుట్ట’ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం వెంటనే స్పందించి కర్రెగుట్టల్లో భద్రతాదళాలను వెనక్కి పిలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా, భద్రతాబలగాలు గత పదిహేను రోజులుగా కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి.