Operation Sindoor: ఇదిగో ఇందుకే.. భారత్ టార్గెట్ చేసి మరీ.. ఆ 9 ప్రాంతాల్లో ఎటాక్ చేసింది..
’ఆపరేషన్ సిందూర్‘లో భాగంగా భారత ఆర్మీ పాకిస్తాన్‌లో నాలుగు ప్రాంతాలు, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఐదు ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది.

Image ANI
Operation Sindoor: పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ప్రాంతాలపై భారత్ మెరుపుదాడులు చేసింది. అర్ధరాత్రి రాఫెల్ జెట్లతో విరుచుకుపడింది. భారత్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి.. పాకిస్తాన్ మిలటరీ స్థావరాల మీద ఎలాంటి దాడులు చేయలేదు. కేవలం ఉగ్రస్థావరాలను టార్గెట్ గా చేసుకుని ఎటాక్ చేసింది. ఈ తొమ్మిది ప్రాంతాలనే ఎంచుకోవడం వెనుక కారణాలు చాలా ఉన్నాయి. పుల్వామా నుంచి పహల్గాం వరకు భారత్ లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఉగ్రదాడులకు మూలం ఈ ప్రాంతంలోనే ఉందని భారత్ భావిస్తోంది. దీంతోపాటు తగిన ఇంటెలిజెన్స్ సమాచారం కూడా ఉంది. అందుకే ఈ తొమ్మిది ప్రాంతాలను టార్గెట్ చేసుకుని మెరుపుదాడులు చేసింది.
దాడి చేసిన తొమ్మిది స్థలాల వివరాలు..
ఈ ఆపరేషన్‌లో భారతదేశం పాకిస్తాన్‌లో నాలుగు స్థలాలను, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఐదు స్థలాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ ప్రాంతాలు ఉగ్రవాద కార్యకలాపాలను ప్లాన్ చేయడానికి, భారతదేశంపై దాడులు నిర్వహించడానికి మూల కేంద్రాలు.
మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ (పాకిస్తాన్) – జైష్-ఎ-మొహమ్మద్ (JeM)..
ఇది జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. 2019లో జరిగిన పుల్వామా దాడితో సహా అనేక ఉగ్రవాద దాడులకు సంబంధించిన శిక్షణ ఈ శిబిరంలో జరిగినట్లు ఆధారాలున్నాయి. ఈ శిబిరం బహవల్పూర్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉంది, ఇది దాదాపు ఢిల్లీ నుండి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మర్కజ్ తైబా, మురిద్కే (పాకిస్తాన్) – లష్కర్-ఎ-తోయిబా (LeT)..
మురిద్కేలోని ఈ శిబిరం లష్కర్-ఎ-తోయిబా ప్రధాన స్థావరం. 2008 ముంబై దాడులకు మాస్టర్‌మైండ్ అయిన హఫీజ్ సయీద్ ఈ శిబిరం నుండి కార్యకలాపాలను నిర్వహించాడు. ఈ శిబిరం పంజాబ్ ప్రావిన్స్‌లో ఉంది.
సర్జల్ / తెహ్రా కలాన్ (పాకిస్తాన్) – జైష్-ఎ-మొహమ్మద్ ..
ఇది కూడా జైష్-ఎ-మొహమ్మద్‌కు సంబంధించిన శిక్షణ శిబిరం. ఇక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తారని రిపోర్ట్స్ ఉన్నాయి.
సియాల్కోట్ (పాకిస్తాన్) – హిజ్బుల్ ముజాహిదీన్ (HM)..
సియాల్కోట్‌లోని ఈ ప్లేస్ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినది. ఈ శిబిరం భారతదేశంలో, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చింది.
మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా, భింబర్ (పాక్ ఆక్రమిత కాశ్మీర్)
భింబర్‌లోని ఈ శిబిరం ఉగ్రవాదులకు శిక్షణ, ఆశ్రయం కల్పించే కేంద్రం.
మర్కజ్ అబ్బాస్, కోట్లీ (పాక్ ఆక్రమిత కాశ్మీర్)..
కోట్లీలోని ఈ ప్లేస్ ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్ లాంటిది. భారతదేశంపై దాడులు ఇక్కడే ప్లాన్ చేశారు.
షవాయ్ నల్లా శిబిరం, ముజఫరాబాద్ (పాక్ ఆక్రమిత కాశ్మీర్)..
ముజఫరాబాద్‌లోని ఈ శిబిరం ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలకు ముఖ్యమైన కేంద్రం.
సోహనుల్లా మసీదు, కోట్లీ (పాక్ ఆక్రమిత కాశ్మీర్)..
దీన్ని ఉగ్రవాదుల షెల్టర్ గా ఉపయోగిస్తారు. ఇక్కడ జైష్-ఎ-మొహమ్మద్ లీడర్ మసూద్ అజహర్ దాక్కున్నట్లు సమాచారం.
భారత్ నిర్వహించిన మెరుపుదాడుల్లో సుమారు 80 నుంచి 100 మంది వరకు చనిపోయి ఉంటారని అంచనా. అయితే, పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం కేవలం 8 మంది చనిపోయినట్టు ప్రకటించింది.
Graphic representation of the targets taken by the Indian Armed Forces under #OperationSindoor in Pakistan and PoJK https://t.co/cEasBn51U9 pic.twitter.com/HMONRGQxWW
— ANI (@ANI) May 7, 2025