నా లైఫ్ గురించి వాళ్లకే ఎక్కువ తెలుసు.. స్మితా సబర్వాల్ సెటైర్లు
సెంట్రల్ సర్వీసులకు వెళుతున్నారని వచ్చిన వార్తలతో పాటు, తన పొలిటికల్ ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చారు డైనమిక్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్.
![నా లైఫ్ గురించి వాళ్లకే ఎక్కువ తెలుసు.. స్మితా సబర్వాల్ సెటైర్లు నా లైఫ్ గురించి వాళ్లకే ఎక్కువ తెలుసు.. స్మితా సబర్వాల్ సెటైర్లు](https://10tv.in/wp-content/uploads/2024/03/Smita-Sabharwal.jpg)
Smita Sabharwal Pic: @SmitaSabharwal
Smita Sabharwal : స్మితా సబర్వాల్.. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. డైనమిక్ ఐఏఎస్ అధికారిగా పేరు గాంచిన ఆమె సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ట్విటర్ ద్వారా ప్రజలతో పంచుకుంటూ ఉంటారు. ట్విటర్లో ఆమెకు 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు.. ఆమె క్రేజ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె ప్రముఖంగా వార్తల్లో నిలిచారు.
కాంగ్రెస్ సర్కారు ప్రాధాన్యత తగ్గించడంతో సెంట్రల్ సర్వీసులకు వెళతారన్న వార్తలు కూడా వచ్చాయి. నిజంగానే ఆమె సెంట్రల్ సర్వీసులకు వెళతారా? భవిష్య్తత్తులో రాజకీయాల్లో వస్తారా, తనపై విమర్శలకు ఎలా స్పందిస్తారు, ఉద్యోగ నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎలా ఎదుర్కొంటారు అలాంటి ప్రశ్నలకు స్మితా సబర్వాల్ స్వయంగా సమాధానాలిచ్చారు. ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
సెంట్రల్ సర్వీసులకు వెళుతున్నారని వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. నేను అప్లయ్ చేసినట్టు నాకే తెలియదు. కొన్ని విషయాలు యూట్యూబ్ లో చూసి తెలుసుకుంటాను. నా లైఫ్ గురించి వాళ్లకే ఎక్కువ తెలుసు అంటూ సెటైర్లు వేశారు. సెంట్రల్ సర్వీసులకు వెళ్లడం లేదని ఆమె స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాజకీయాల్లో వస్తారా అని ప్రశ్నించగా.. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడాలంటూ సమాధానమిచ్చారు. తనపై వచ్చే విమర్శల గురించి పెద్దగా పట్టించుకోనని, తన పని తాను సిన్సియర్‌గా చేసుకుపోతానని చెప్పారు.
మొదటి ప్రయత్నంలోనే తనకు ఐఏఎస్ రాలేదని.. సివిల్స్ ఇంటర్వూలో తనను 12 ప్రశ్నలు అడిగారని వెల్లడించారు. చిన్పప్పుడు స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, మ్యూజిక్ నేర్చుకున్నానని తెలిపారు. అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటానని.. లేటెస్ట్గా గుంటూరు కారం చూశానని చెప్పారు. ఒత్తిళ్ల ఎదుర్కొవడానికి తన ఇంటి గార్డెన్లో సేదతీరతానని అన్నారు. మెదక్ ప్రాంతంతో చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయని.. వర్కింగ్ విమెన్ తనకు స్ఫూర్తి అని తెలిపారు. సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ గురించి మాట్లాడుతూ.. మంచి పనులు చేస్తే జనం అభిమానిస్తారని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు.
Also Read: తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం.. డీఎస్పీ ప్రణీత్ రావుపై సస్పెన్షన్ వేటు!