Chennai Egmore Express : కాచిగూడ నుంచి చెన్నై వెళ్తున్న చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్ రైల్లో పొగలు వ్యాపించాయి. గద్వాల స్టేషన్ కు చేరుకున్న రైలులోని బీ4 బోగీలో పొగలు దట్టంగా వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ప్రయాణికులను కిందకు దింపేశారు. అనంతరం రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. ఆ తర్వాత ట్రైన్ మళ్లీ బయలుదేరింది. రైల్లో పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలే జరిగిందో తెలియక కంగారుపడ్డారు. అయితే, ఎటువంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే దట్టమైన పొగలు వచ్చినట్లు రైల్వే సిబ్బంది చెబుతున్నారు. పొగలు రావడంతో బీ4 బోగీలోని ప్రయాణికులు ఆందోళన చెందారు. విషయం తెలిసిన వెంటనే రైల్వే సిబ్బంది స్పందించారు. రైలుని ఆపేసి పొగలు వచ్చిన బోగీలో మరమ్మతులు చేశారు. ఆ తర్వాత యధావిధిగా రైలు ముందుకు కదిలింది. ఎటువంటి ప్రమాదం జరక్కపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, ఈ ఘటన రైల్వే స్టేషన్ కు సమీపంలో జరిగిందని, సిబ్బంది వెంటనే స్పందించారని, దాంతో ప్రమాదం తప్పినట్లైందని ప్రయాణికులు అంటున్నారు. ఒకవేళ ఈ ఘటన రైల్వే స్టేషన్ కు దూరంలో జరిగి ఉంటే, మంటలు చెలరేగి ఊహించని ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని ప్రయాణికులు వాపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులకు ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు.
Also Read : అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, పోలీసులకు కీలక ఆదేశాలు