Cm Revanth Reddy : అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, పోలీసులకు కీలక ఆదేశాలు
ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.

Cm Revanth Reddy : అల్లు అర్జున్ నివాసం వద్ద ఓయూ జేఏసీ విద్యార్థుల ఆందోళనలు, రాళ్ల దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆందోళనకారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నామన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్న ఆయన.. లా అండ్ ఆర్డర్ పై డీజీపీ, సీపీ కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకూడదన్నారు. అలా స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
”సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నా. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి” అని ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
అటు..అల్లు అర్జున్ నివాసం ఎదుట ఆందోళన చేసిన ఓయూ జేఏసీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టనున్నారు. అటు హీరో అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోలీసుల భద్రత కొనసాగుతోంది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం రోజురోజుకి ముదురుతోంది. ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటి ముందు ఆందోళన చేశారు. రాళ్ల దాడికి కూడా పాల్పడటం కలకలం రేపింది. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని, కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంటూ జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి ముందు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.
పలువురు విద్యార్థులు అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. వారిని అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉన్న సిబ్బంది అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంలో ఆందోళనకారులు టమాటాలు, రాళ్లు విసిరారు. అల్లు అర్జున్ ఇంట్లో ఉన్న పూల కుండీలను పగలకొట్టారు. రేవతి చావుకు కారణం అల్లు అర్జున్ అంటూ నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి కోటి రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Also Read : పుష్ప 2 సినిమాలో ఆ సీన్ దారుణం.. సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకున్నారు?- అల్లు అర్జున్ పై ఎంపీ అనిల్ ఫైర్
సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను.
శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు.
సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు…
— Revanth Reddy (@revanth_anumula) December 22, 2024