South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. జులై 3 వరకు ఆ రూట్లలో 36 రైళ్లు రద్దు.. 22 ఎంఎంటీఎస్ రైళ్లు కూడా..

వివిధ రకాల మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ ఆధ్వర్యంలో 36రైల్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

South Central Railway

South Central Railway: వివిధ రకాల మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా హైదరాబాద్(Hyderabad), సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే డివిజనల్ ఆధ్వర్యంలో 36 రైల్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 25 నుంచి జులై 3వ తేదీ వరకు ఈ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపింది. వీటిలో కొన్నింటిని ఒక్కోరోజు, మరికొన్ని అన్ని రోజులు రద్దు చేశారు.

మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లను 25, 26 తేదీల్లో, కాచిగూడ నుంచి రాయచూర్, మహబూబ్ నగర్ వెళ్లే రైళ్లను 24, 26 తేదీల్లో రద్దు చేస్తారు. అదేవిధంగా కరీంనగర్ నుంచి నిజామాబాద్, సిర్పూర్ టౌన్ మధ్య నడిచే రైళ్లను 26 నుంచి జులై 3వ తేదీ వరకు రద్దు చేశారు. అదేవిధంగా కాజీపేట నుంచి డోర్నకల్, భద్రాచలం – విజయవాడ, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్, వరంగల్, ప్యాసింజర్లను ఈనెల 26 నుంచి జులై 2వరకు నిలిపివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

South Central Railway

ఒడిశాలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన ఎనిమిది రైళ్లను రద్దుచేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈనెల 25, 26 తేదీల్లో షాలిమార్ – హైదరాబాద్, సత్రగచి – తిరుపతి, హౌరా – పుదుచ్చేరి, చెన్నై -సత్రగచి, మైసూర్- హౌరా, తిరుపతి – సత్రగచి, ఎర్నాకులం – హౌరా స్టేషన్ల పరిధిలో రైళ్లు రద్దయ్యాయి. తిరుపతి – కట్ పడి స్టేషన్ల మధ్య రెండు రైళ్లు రద్దయ్యాయి. ఈ ఎనిమిది రైళ్లను పాక్షికంగానే రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

South Central Railway: రైళ్లపై రాళ్లేస్తే జైలుకే.. మూడు నెలల్లో 39 మందికి జైలు శిక్ష

సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల నేపథ్యంలో నగరంలో తిరగాల్సిన మొత్తం 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను ఈనెల 26 నుంచి జులై 2వరకు రద్దు చేస్తున్నట్లు ఎస్‌సీ‌ఆర్ అధికారులు తెలిపారు. లింగంపల్లి – హైదరాబాద్, ఉందానగర్ – లింగంపల్లి, ఫలక్‌నుమా – లింగంపల్లి స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. రైల్వే ప్రయాణికులు రైళ్ల రద్దు విషయాన్ని గమనించి సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.