Life is precious : తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి

Spandana
Spandana Eda Foundation : జీవితం చాలా విలువైనది.. చిన్న కారణాలతో జీవితాలను మధ్యలో వదిలివేయొద్దని, తల్లిదండ్రులకు పుత్ర శోకాన్ని మిగల్చొద్దని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ‘స్పందన ఇదా ఫౌండేషన్’ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామల్ రెడ్డి ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ‘జీవితం చాలా విలువైనది’ అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…విద్యార్థులు ఒత్తిడికి గురై క్షణికావేశంతో తమ విలువైన జీవితాన్ని ఆత్మహత్యల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఇది తగదని, ఏ సమస్య ఉన్నా మనోధైర్యంతో ముందుకు వెళ్లి విజయం సాధించాలే తప్ప, ఆత్మహత్యలు చేసుకోవడం సబబు కాదన్నారు.
అనంతరం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…ఇది మొదట పిల్లలకు అవగాహన సదస్సు కాదని, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు జీవితంపై అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులను చదువు పేరుతో మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారని, వారి ఎదుగుదలకు ఇబ్బందులు పెడుతున్నారని ఆయన చెప్పారు. పిల్లలకు చదువుతో పాటు క్రీడలు, వ్యాయామం అవసరమని, దీంతో వారిలో మానసిక ఉల్లాసంతో ఉత్సాహం పెరిగి వారు ఎంచుకున్న గమ్యాలకు చేరుకుంటారన్నారు. క్షణికావేశంలో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో సావిత్రీబాయి ఫౌండేషన్ అధ్యక్షురా లు మాధవితో పాటు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాలాచారి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, తెలంగాణ సలహాదారులు కేవీ రమణాచారి తదితరులు పాల్గొన్నారు.