×
Ad

MLA Defection Case : కడియం, దానంలకు మరోసారి స్పీకర్ నోటీసులు.. అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే..!

Telangana : తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు స్పీకర్‌ ..

Kadiyam Srihari, Danam Nagender

Telangana : పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ లకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేశారు.

పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ నేటితో ముగియనుంది. కేసు విచారణ ఆలస్యంపై ఇప్పటికే సుప్రీంకోర్టు సీరియస్ అవడంతోపాటు నాలుగు వారాలు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణలో వేగం పెంచాలని అసెంబ్లీ స్పీకర్ నిర్ణయించారు.

బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీలో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 10మంది ఎమ్మెల్యేలపై విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది స్పీకర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. తమ అపిడవిట్లను దాఖలు చేశారు. అయితే, దానం నాగేందర్, కడియం శ్రీహరిలు విచారణకు హాజరుకాలేదు. స్పీకర్ నోటీసులకు స్పందించలేదు.

అయితే, విచారణను మరింత ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ విపక్ష బీఆర్ఎస్ నవంబర్ 17న సుప్రీంకోర్టులో స్పీకర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. దీంతో, ఈ వ్యవహారంలో స్పీకర్‌ వేగం పెంచారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు నోటీసులకు స్పందించని దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు మరోసారి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా అనర్హత పిటిషన్లపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్పీకర్‌ స్పష్టం చేశారు. అయితే, స్పీకర్ నోటీసులకు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు స్పందిస్తారా..? లేదా అనేది వేచి చూడాల్సిందే.

విచారణకు హాజరైతే వేటు పడుతుందని దానం, కడియంలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేటుపడితే ఆరు సంవత్సరాల పాటు పోటీ చేయడానికి నో ఛాన్స్. ఈ క్రమంలో రాజీనామా చేసేందుకు వారు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలో దానం నాగేందర్ ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. రాజీనామా చేస్తే తన పరిస్థితి ఏమిటని పార్టీ పెద్దలతో దానం సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కడియం శ్రీహరి, దానం నాగేందర్ లు ఇప్పటికే తమ అనుచరులతో బేటీ అయినట్లు తెలిసింది. రాజీనామా విషయమై చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో వీరిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.

Also Read: Bihar CM Nitish Kumar : బీహార్‌లో కొలువుదీరిన ఎన్డీయే సర్కార్.. సీఎంగా నితీశ్.. డిప్యూటీ సీఎంలుగా ఆ ఇద్దరు.. మొత్తం 26మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం..