Medaram Jatara
Medaram Jatara : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత సంపాదించుకున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రంగం సిద్ధమైంది. ఈ నెల 28వ తేదీ నుంచి జాతర ప్రారంభం కానుంది. 31వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జాతర జరగనుంది. ఈ క్రమంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది.. ఇదే సమయంలో టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది.
Also Read : KTR: వాళ్లు నన్ను అడగటం కాదు.. నేనే వాళ్లని ప్రశ్నించా- సిట్ విచారణపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 28 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లలో రిజర్వేషన్ ఉండదని అధికారులు తెలిపారు. ఈ నెల 28 నుంచి 30 వరకు సికింద్రాబాద్, మంచిర్యాల మీదుగా మూడు సర్వీసులు, మంచిర్యాల-సికింద్రాబాద్ మధ్య మరో మూడు సర్వీసులు నడవనున్నాయి. అదేవిధంగా.. సికింద్రాబాద్- సిర్పూర్‌కాగజ్ నగర్‌కు 2, సిర్పూర్ కాగజ్ నగర్- సికింద్రాబాద్‌కు 2, నిజామాబాద్-వరంగల్ మధ్య 4, వరంగల్ – నిజామాబాద్ మధ్య 4, కాజీపేట – ఖమ్మం మధ్య 4, ఖమ్మం – కాజీపేట మధ్య 4, ఆదిలాబాద్ -కాజీపేట మధ్య 1, కాజీపేట ఆదిలాబాద్ మధ్య ఒక సర్వీసు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రైళ్లన్నీ మౌలాలి, చర్లపల్లి, బీబీనగర్, భువనగిరి, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగామ, రఘునాథపల్లి, ఘనాపూర్, పిండ్యాల్, కాజీపేట, వరంగల్, పెద్దపల్లి, రామగుండం తదితర స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
మరోవైపు మేడారం జాతర కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ఈసారి జాతరకు ఏకంగా నాలుగు వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని 51 పాయింట్ల నుంచి ఈ బస్సులను తిప్పనుంది. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి ఈ బస్సులు మేడారంకు రాకపోకలు సాగించనున్నాయి.
ఈ బస్సులు ఈనెల 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు తిప్పనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. మేడారంలో 50ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా తొమ్మిది కిలో మీటర్ల పొడవుతో 50క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ క్యూలైన్లలో 20వేల మంది ఒకేసారి నిలబడొచ్చు. ప్రయాణికుల కోసం రెస్ట్ రూమ్స్, వేచి ఉండేందుకు కుర్చీలు, అలాగే వాటర్ లాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. బస్సుల పార్కింగ్ కోసం 26 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు.
మేడారం జాతరకు తిరిగే ప్రత్యేక బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉండనుంది. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే ఉచిత ప్రయాణ సౌకర్యం మహిళలకు ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.