Srushti Fertility
Srushti Fertility : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ (Srushti Fertility) కేసు విచారణలో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేరం చేసినట్లుగా పోలీసుల విచారణలో డాక్టర్ నమత్ర ఒప్పుకున్నారు.
సృష్టి కేసులో డాక్టర్ నమ్రత స్టేట్మెంట్ ప్రకారం.. కొడుకు జయంత్ కృష్ణ న్యాయవాది కావడంతో పూర్తి సహకారం అందించారు. 1998లో విజయవాడ, 2007లో సికింద్రాబాద్ ఫెర్టిలిటీ సెంటర్స్ ప్రారంభించారు. విశాఖపట్నంలో ఆసుపత్రిని ప్రారంభించి తమ దగ్గరికి వచ్చిన పిల్లలు లేని దంపతుల నుండి సరోగసి పేరిట రూ.20నుండి రూ. 30లక్షలు వసూళ్లు చేసినట్లు నమ్రత అంగీకరించారు.
ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసినట్లుగా అంగీకరించారు. ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు డబ్బులు ఆశ చూపి శిశువు విక్రయానికి ఒప్పందం కుదుర్చుకునేవారు. ప్రసవం తరువాత బాలింతల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసేవారు. అలా ఎంతోమంది పిల్లలు లేని దంపతులను మోసం చేశామని.. సరోగసి ద్వారానే పిల్లలను పుట్టించినట్లుగా నమ్మించామని డాక్టర్ నమ్రత వాంగ్మూలం ఇచ్చింది.
ఏపీలోని మహారనిపేటలో నాలుగు కేసులు, విశాఖ టూటౌన్‌లో రెండు కేసులు, గుంటూరు కొత్తపేటలో ఒక కేసు, తెలంగాణలో గోపాలపురంలో ఐదు కేసులు తనపై ఉన్నట్లు నమ్రత ఒప్పుకున్నారు.
పేద గర్భిణుల నుండి ప్రసవం తర్వాత బిడ్డలను కొనుగోలులో సంజయ్ తో పాటు సంతోషీ కీలకంగా వ్యవహరించారని, తన రెండో కుమారుడు లీగల్ గా సహకరించేవాడని తన వాంగ్మూంలో డాక్టర్ నమ్రత పేర్కొంది. విశాఖపట్నం, విజయవాడ, సికింద్రాబాద్‌లో ఉన్న డాక్టర్లు, స్టాఫ్‌తో కలిసి సరోగసి దందా నడిపించామని, పిల్లల కొనుగోలుపై డాక్టర్ నమ్రత నేరాన్ని ఒప్పుకున్నారు.