×
Ad

Gram Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల డేట్స్ ఇవే..!

గ్రామ పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.

Gram Panchayat Elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ నెల 24న గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు చేసి కొత్త షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈసారి బీసీ, ఓసీ రిజర్వేషన్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు యధాతథంగా ఉండనున్నాయి. ఈ నెల 24న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పును బట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనుంది ఎస్ఈసీ. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారని సమాచారం. డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది.

అటు పంచాయతీల్లో మరోసారి ఓటరు జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబర్ 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది. 20వ తేదీన ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణ చేయనుంది. 21వ తేదీన ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరిస్తుంది. 23న ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎస్ఈసీ తెలిపింది.

Also Read: కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి.. నెక్ట్స్ జరిగేది ఇదే..