తాగి నడపారో..ఇక అంతే సంగతులు : ఆఫీసులకు సమాచారం, రూ. 10 వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష

Rachakonda Police Commissionerate : మందేసి, బండి తీసుకుని రోడ్డు ఎక్కేముందు ఒక్కసారి కాదు..పది సార్లు ఆలోచించుకోండి. లేకపోతే మీకే నష్టం. ఎందుకంటే..ఫుల్లుగా మందు తాగి..నడుపుతూ..నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న ఘటనలు అధికమౌతున్నాయి. దీంతో రాచకొండ పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకొనేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ సంవత్సరం 3 వేల 287 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు రాచకొండ సీపీ వెల్లడించారు. అందులో భాగంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోందన్నారు.

ఇకపై తాగి బండి నడిపితే..వారి ఆఫీసులకు సమాచారం చేరవేస్తామని, మొదటిసారి పట్టుబడితే..రూ. 10 వేలు ఫైన్, ఆరు నెలల జైలు శిక్ష, మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తామని ప్రకటించారు. ఇక రెండోసారి పట్టుబడితే..రూ. 15 వేలు జరిమాన, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.  మరోవైపు..హైదరాబాద్ సిటీలో పోలీసు హై కమాండ్ ఆర్డర్ ప్రకారం.. పలు ప్రాంతాల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో కొంతకాలంగా నిలిపేసిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ను ప్రారంభించారు.

రాత్రి వేళల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ పెడుతున్నారు. బ్రీత్‌ ఎన్‌లైజర్‌ ద్వారా వారిని గుర్తించి వెహికల్స్ స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. కరోనా నేపథ్యంలో పూర్తిగా నిలిపివేసిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ హై కమాండ్ ఆర్డర్ల మేరకు మళ్లీ ప్రారంభించామని, వాహన దారులు మద్యం సేవించి రోడ్డుపైకి రావద్దని సూచిస్తున్నామన్నారు ట్రాఫిక్ అధికారులు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడితే వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు జైలుకు పంపించడం ఖాయమని స్పష్టం చేశారు. సో…మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్నారు.