Supreme Court: న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు నిమిత్తం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ హత్య కేసును తిరిగి విచారణ జరపాలని, పిటిషనర్‌కు భద్రత కల్పించాలని సీబీఐకి న్యాయస్థానం సూచించింది.
న్యాయవాది వామనరావు, ఆయన సతీమణి నాగమణి దంపతులను పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద పట్టపగలే రోడ్డుపై 2017 ఫిబ్రవరి 17వ తేదీన దుండగులు దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు ఆందోళనలు చేశారు. ఈ కేసులో పలువురిని అరెస్టు చేయగా.. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వామనరావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్‌కె సింగ్‌ల ధర్మాసనం పిటిషన్ పై విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించిన వీడియోలుసహా అన్ని పత్రాలు తమ ముందు ఉంచాలని గతంలో తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, సీబీఐ విచారణ అవసరమా అనే అంశంపై రికార్డులు పరిశీలించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది.
వామనరావు దంపతుల హత్యకేసుకు సంబంధించిన అన్ని ఎవిడెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఇదే సమయంలో కేసును సీబీఐకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వామనరావు దంపతుల హత్యకేసు విచారణను సీబీఐకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.