Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అలీఖాన్ నియామకం రద్దు.. కారణం అదేనా..

తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందుర్కర్ ధర్మాసనం.. (Supreme Court)

Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ల నియామకాన్ని రద్దు చేసింది. తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ వ్యతిరేకించడం, వేరే వాళ్లను నియమించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. ఈ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.

జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందుర్కర్ ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలలో తదుపరి నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆగస్టు 14, 2024 తీర్పులో మార్పులు చేసింది సుప్రీంకోర్టు. కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ లు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియామకం అయిన సంగతి తెలిసిందే.

గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది కచ్చితంగా సంచలనం అంశంగా చూడాలి. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్, గతంలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్ గా ఉన్న కోదండరామ్ మొట్టమొదటిసారిగా చట్టసభల్లో అడుగుపెట్టారు. ఆయన నియామకాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేయడం అనేది ఆసక్తికర అంశం.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పంపింది. వారిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆ వెంటనే దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి ప్రమాణస్వీకారానికి కోర్టు లైన్ క్లియర్ చేసింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాదాపు ఏడాది కాలంగా పోరాటం చేస్తూ వచ్చారు. తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది.

రాజకీయాల్లో ఉన్నారనే కారణంతో తిరస్కరణ..

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ.. వీరిద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పుడు గవర్నర్ గా తమిళిసై ఉన్నారు. అయితే ఆ ఇద్దరి నియామకాలను చాలా కాలం పాటు హోల్డ్ లో ఉంచిన అప్పటి గర్నవర్ తమిళిసై ఏకంగా రద్దు చేశారు. అసలు నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. వారిద్దరూ రాజకీయ పార్టీల్లో క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి వారి నియామకం కుదరదు.. గవర్నర్ కోటా కాబట్టి రాజకీయ పార్టీలో ఉన్న వారికి ఇవ్వలేము అని గవర్నర్ తేల్చి చెప్పడంతో వారి నియామకం ఆగిపోయింది.(Supreme Court)

ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ సీఎం అయ్యాక.. కోదండరామ్, అలీ ఖాన్ పేర్లను నామినేట్ చేస్తూ గవర్నర్ కు పంపారు. గవర్నర్ ఆమోదం తెలపడంతో వారిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోదండరామ్, అలీ ఖాన్ లు ఎలా అర్హులు అవుతారు అని ప్రశ్నిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో కోదండరామ్, అలీ ఖాన్ లు ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

కోదండరామ్, అలీ ఖాన్ ల నియామకం చెల్లదంది. గతంలో దాసోజు, సత్యనారాయణల నియామకాన్ని ఎందుకు ఆపారు? వారిద్దరికి ఎందుకు ఇచ్చారు? అనేదానిపై వాదోపవాదాలు జరిగాయి. గవర్నర్ చర్యను సుప్రీంకోర్టు ఒక రకంగా తప్పు పట్టిందని చెప్పాలి. గతంలో ఒక గవర్నర్ వారిద్దరు రాజకీయ నాయకులు అనే కారణంతో వారి నియామకం చెల్లదన్నారు. మరి కోదండరామ్, అలీ ఖాన్ ల నియామకం ఎలా చెల్లుతుంది? అదే కారణం వీరికి కూడా వర్తిస్తుంది అని న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. (Supreme Court)

రాజకీయాల్లో ఉన్నారనే కారణం చూపటం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో చాలామంది రాజకీయ నాయకులు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియామకం అయ్యారు. కాబట్టి అది ఒక సహేతుక కారణం కాదు అని బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఆర్గుమెంట్ చేశారు.

Also Read: గువ్వల బాలరాజు చేరికపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు.. ఏం జరుగుతోంది?