Telangana Tahsildar Transfers: తెలంగాణలో తహసీల్దార్ల బదిలీలపై తీవ్ర విమర్శలు..
వాస్తవానికి డిస్ట్రిక్ రెవెన్యూ ఆఫీసర్ గా పదోన్నతి పొందాలంటే.. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. తహసిల్దార్ గా ఉన్న వారికి మొదట డిప్యూటీ కలెక్టర్ గా ప్రమోషన్ వస్తుంది.
Telangana Tahsildar Transfers: తెలంగాణలో తహసీల్దార్ల బదిలీ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బదిలీ చేయడమే కాదు.. వారికి నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తహసీల్దార్ల బదిలీలు, ప్రమోషన్లను ఉద్యోగ సంఘాలే తప్పుబడుతున్నాయి. తహసీల్దార్లను ఏకంగా డిస్ట్రిక్ రెవెన్యూ ఆఫీసర్లుగా ప్రమోషన్ కల్పిస్తూ.. ట్రాన్స్ ఫర్ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టారాజ్యంగా బదిలీలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ పరిపాలన అస్తవ్యస్తంగా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో ప్రభుత్వం 12 మంది తహసీల్దార్లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల రీత్యా ఈ బదిలీలు చేపట్టినట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. అయితే బదిలీలు చేయడంలో తప్పు లేదు కానీ… వారిలో కొందరిని డీఆర్వోలుగా, మరి కొందరిని స్పెషల్ కలెక్టర్ పీఏగా, ఎస్డీసీ-ఎల్ఏగా నియమించడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి డిస్ట్రిక్ రెవెన్యూ ఆఫీసర్ గా పదోన్నతి పొందాలంటే.. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. తహసిల్దార్ గా ఉన్న వారికి మొదట డిప్యూటీ కలెక్టర్ గా ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందుతారు. ఆ తర్వాత అడిషనల్ కలెక్టర్ గా సీనియారిటీని బట్టి ప్రమోషన్ ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా ఇప్పుడు తహసీల్దార్ల విషయంలో నిబంధనలను పట్టించుకోకుండా… డైరెక్ట్ గా డీఆర్వోలుగా నియమించడం వివాదాస్పదమైంది. ఓ మంత్రి రికమండేషన్ తో.. ఏకంగా ఏడుగురు తహసిల్దార్లను డిస్ట్రిక్ రెవెన్యూ ఆఫీసర్లుగా నియమించారు. అంతేకాదు… ఒకరిని కలెక్టర్ కు పీఏగా..మరో నలుగురిని ఎస్డీసీ-ఎల్ఏగా ఉన్నత స్థాయి పోస్టుల్లోకి బదిలీ చేశారు. ఈ నిర్ణయమే ఇప్పుడు వివాదానికి, ఆరోపణలకు కారణమైంది. రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నిబంధనలకు విరుద్ధంగా.. మంత్రి ఆదేశాల ప్రకారం ఇష్టారాజ్యంగా తహసీల్దార్లకు ఉన్నత స్థాయి పోస్టుల్లోకి బదిలీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా నిబంధనలను తుంగలో తొక్కి.. అనుయాయులకు, అనర్హులకు ఉన్నత స్థాయి పోస్టులను కట్టబెడితే… పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రెవెన్యూలోని ఉన్నత స్థాయి అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా ఇలా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు జరిగితే.. అర్హులైన వారికి తీవ్ర నష్టం జరుగుతుందని మండిపడుతున్నారు. ఇకనైనా సమర్థవంతమైన, మెరుగైన పాలన రాష్ట్రంలో ఉండాలంటే అర్హులైన వారికే పదోన్నతులు, ఇవ్వాలని కోరుతున్నారు.
Also Read: ఎకరం రూ.237 కోట్లు.. హైదరాబాద్ లో ఆల్ టైమ్ రికార్డు బ్రేక్.. ఈ ఏరియాలో..
