Aarogyasri Network Hospitals: తెలంగాణ ప్రభుత్వంతో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు సమ్మెను విరమించాయి. ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో సమ్మెను విరమించారు. నేటి నుంచి తెలంగాణలో యధావిథిగా ఆరోగ్యశ్రీ సేవలు అందనున్నాయి.
హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహని ఆరోగ్యశ్రీ నెటవర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు అసోసియేషన్ ప్రతినిధులు. పేదలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వానికి సహకరిస్తున్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటళ్లను మంత్రి అభినందించారు. ప్రతి నెల నిధులు విడుదల చేస్తామన్నారు. ఆసుపత్రులు కోరుతున్న ఇతర అంశాలపైనా సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి దామోదర రాజనర్సింహ వారికి హామీ ఇచ్చారు.