TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7,754 స్పెషల్ బస్సులు.. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రాలకు కూడా..
TGSRTC Special bus services: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది.

TGSRTC Special bus services
TGSRTC Special bus services: తెలంగాణలోని పలు ప్రాంతాలతోపాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC Special bus services) గుడ్‌న్యూస్ చెప్పింది. బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 7,754 ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఆ సంస్థ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈనెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది.
Also Read: MLAs Defection Issue: ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో ట్విస్ట్.. ఆ ఆరుగురికి స్పీకర్ నోటీసులు
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 7754 స్పెషల్ బస్సులను తిప్పేందుకు ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది. సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదిల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని టీజీఎస్ ఆర్టీసీ పేర్కొంది.
హైదరాబాద్‌లో ప్రధాన బస్టాండ్‌లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపించనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అయితే, స్పెషల్ బస్సుల్లో 50 శాతం వరకు అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది.
ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tgsrtcbus.in లో చేసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ సూచించింది. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ సూచించారు.