Telangana Assembly
Telangana Assembly adjourned : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ మూడు రోజులు వాయిదా పడింది. శాసనసభ, మండలి సమావేశాలకు మూడు రోజుల వరకు విరామం ఇచ్చింది ప్రభుత్వం. అక్టోబర్ 1న తిరిగి ఉభయసభలు సమావేశం కానున్నాయి.
గులాబ్ తుపాను, భారీ వర్షాల దృష్ట్యా సమావేశాలకు విరామం ప్రకటించినట్టు ప్రభుత్వం పేర్కొంది. అధికారులు, ఎమ్మెల్యేలు సహాయచర్యల్లో పాల్గొనాల్సినందున నిర్ణయించింది. వర్షాకాల సమావేశాలపై సభాపతి, ప్రొటెం ఛైర్మన్ సభ నేత నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆయా పక్షనేతలను సంప్రదించి సభ్యుల విజ్ఞప్తి మేరకు సభాపతి, ప్రొటెం ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.
Gulab Effect : తడిసి ముద్దైన తెలంగాణ.. 14జిల్లాల్లో రెడ్ అలర్ట్..!
ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు 28న ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రజాప్రతినిధులందరూ.. తమ నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో వర్షాలు, వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండాలి.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ప్రజాప్రతినిధులందరూ రాజధానికే పరిమితం కావాల్సి వస్తుంది. అందుకే అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు వాయిదా వేశారు. ప్రజాప్రతినిధులందరూ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు.
Cyclone Gulab: నేడు, రేపు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
సీఎం కేసీఆర్ సమీక్ష
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమీక్ష నిర్వహించారు. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ హెచ్చరికలతో విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి సీఎస్ సోమేశ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యవసర శాఖలైన రెవెన్యూ, పోలీసు, ఫైర్ సర్వీసులు, మున్సిపల్, నీటిపారుదల శాఖ, పంచాయితీ రాజ్, రోడ్లు భవనాల శాఖలు విధి నిర్వహణలో ఉండాల్సి ఉందని తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని అధికారులకు సీఎస్ సూచనలు చేశారు.