Telangana Speaker : ఈటలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ..

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తెలంగాణ అసెంబ్లీ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం అనంతరం సభ బయట ఈటల రాజేందర్ స్పీకర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులో పేర్కొన్నారు.

Telangana assembly office issues notices BJP MLA Eatala rajender

Telangana Speaker : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తెలంగాణ అసెంబ్లీ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం అనంతరం సభ బయట ఈటల రాజేందర్ స్పీకర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులో పేర్కొన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఈటల మర మనిషి అనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈటల స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈటల అహంకారంతో మాట్లాడుతున్నారని..స్పీకర్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని మంత్రి ప్రశాంత రెడ్డి డిమాండ్ చేశారు.

బీజేపీని బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశానికి పిలవకపోవడంపై ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. గత 20 ఏళ్లుగా తాను అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నానని గుర్తు చేశారు. పార్టీ తరపున ఒక్క సభ్యుడు ఉన్నా బీఏసీని పిలిచే సంప్రదాయం ఉందని ఈ విషయం తెలియదా ? అంటూ ప్రశ్నించారు. అటువంటిది 4 పార్లమెంట్, 3 శాసన సభ్యులు ఉన్న బీజేపీ పార్టీ సభ్యులను బిజినెస్ అడ్వైసరీ కమిటీ మీటింగ్ కి పిలవకపోడం ద్వేష పూరిత రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు.

స్పీకర్ పై ఈటల వ్యాఖ్యలు చేస్తూ..మీకు ఇదే గతి పడుతుందని మర్చిపోకండి. పార్టీలు ఉంటాయి పోతాయి..ముఖ్యమంత్రులు కూడా ఉంటారు పోతారు.కానీ శాసన సభ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. స్పీకర్.. మరమినిషి లెక్క కాకుండా సభ్యుల హక్కులు కాపాడాలి’’ అని విమర్శించారు. ఈ విమర్శలపై అసెంబ్లీ కార్యాలయం ఈటలకు నోటీసులు జారీ చేసింది.

ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తప్పుబట్టారు. ఈటల రాజేందర్ క్షమాపణలు చెప్పాలని..లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈటల రాజేందర్ అహంకారంతో మాట్లాడుతున్నారని, 20 ఏళ్లు అనుభవం ఉందని చెబుతూ సభాపతి స్థానాన్ని అగౌరవపరుస్తూ మాట్లాడటం సరికాదని అన్నారు.