Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభంవేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపై వారు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీశ్ రావుసహా ఆ పార్టీ సభ్యులు గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ఖాళీ యూరియా బస్తాలతో నిరసన తెలిపారు. యూరియా సంక్షోభంకు కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు.
పండుగపూట కూడా రైతన్నలను రోడ్లపైన నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. గణపతి బొప్ప మోరియా.. కావాలయ్యా యూరియా అంటూ నినాదాలు చేశారు. వ్యవసాయ మంత్రి రాజీనామా చేయాలి.. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి అంటూ నినాదాలు చేశారు. రైతన్నలకు యూరియా వెంటనే సరఫరా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్షకాల సమావేశాలు నాలుగు రోజులు పెట్టి చేతులు దులుపుకోవడం కాదు. పదిహేను రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. ప్రజా సమస్యలపై చర్చించాలని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీని దూషించడం కోసం అసెంబ్లీ సమావేశాలు కాదు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరం కమిషన్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోషన్ కమిషన్ కాదు.. పీసీసీ కమిషన్ అంటూ ఎద్దేవా చేశారు.
ఎరువుల కొరత విషయంలో వాయిదా తీర్మానాలు ఇస్తాం. ఈ ప్రభుత్వం రచ్చ చేసే ప్రభుత్వం తప్పా.. చర్చ చేసే ప్రభుత్వం కాదు. కేసీఆర్ హయాంలో దేశంలో తెలంగాణ నెంబర్ గా ఉంది. కానీ, ఇప్పుడు తెలంగాణలో రైతులు యూరియా కోసం రోడ్లెక్కుతున్న పరిస్థితి నెలకొంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామని కేటీఆర్ అన్నారు.