‘నువ్వు గణేశ్ మండపంలో పడుకో నాన్నా’ అని కొడుకుని పంపించేసి.. ప్రియుడితో కలసి భర్తను చంపిన భార్య.. బయటపడిందిలా..

Hyderabad : హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాల వ్యవహారం మరో ప్రాణం తీసింది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను

‘నువ్వు గణేశ్ మండపంలో పడుకో నాన్నా’ అని కొడుకుని పంపించేసి.. ప్రియుడితో కలసి భర్తను చంపిన భార్య.. బయటపడిందిలా..

Hyderabad

Updated On : August 30, 2025 / 10:01 AM IST

Hyderabad : హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాల వ్యవహారం మరో ప్రాణం తీసింది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసింది. అయితే, నిద్రలో చనిపోయాడంటూ స్థానికులను, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది.. కానీ, పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం.. అల్లు అరవింద్ తల్లి కన్నుమూత!

నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన జల్లెల శేఖర్ (40)కు రంగారెడ్డి జిల్లా వెల్దండ మండలం కుప్పగుండ్లకు చెందిన చిట్టి (33)తో 2009లో వివాహం జరిగింది. వారికి 14ఏళ్ల కుమార్తె, 12ఏళ్ల కుమారుడు ఉన్నారు. జీవనోపాధి కోసం వారు హైదరాబాద్‌లోని సరూర్ నగర్ ప్రాంతం కోదండరామ‌నగర్‌కు వలస వచ్చి ఉంటున్నారు. శేఖర్ కారు డ్రైవర్ గా పనిచేస్తుండగా.. చిట్టి వస్త్రాల దుకాణంలో పనిచేస్తోంది. వారి కుమార్తె ప్రభుత్వ హాస్టల్ లో ఉండగా.. కుమారుడు తల్లిదండ్రుల వద్ద ఉంటూ స్థానిక పాఠశాలలో చదువుతున్నాడు.

కొన్నాళ్లకు చిట్టికి స్థానికంగా ఉండే హరీశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంకాస్త వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. నగలు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తుండటంతో భార్య ప్రవర్తనపై శేఖర్ కు అనుమానం వ్చచింది. దీంతో ఈ వస్తువులు ఎక్కడివి.. ఏం చేస్తున్నావ్ అంటూ చిట్టిని భర్త మందలించాడు. దీంతో వారి మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య భావించింది. ప్రియుడు హరీశ్ తో కలిసి అందుకు ప్రణాళిక వేసింది.

ప్రియుడితో కలిసి ముందస్తుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా.. చిట్టి తన కుమారుడ్ని స్థానికంగా ఉండే వినాయక విగ్రహం వద్ద స్నేహితులతో కలిసి నిద్రపొమ్మని పంపించింది. అర్ధరాత్రి తరువాత భర్త శేఖర్ నిద్రపోతున్న సమయంలో ప్రియుడు హరీశ్ ను ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి నిద్రపోతున్న శేఖర్ గొంతునులిమి చంపేందుకు ప్రయత్నించారు. కొద్దిసేపటికి శేఖర్ మరణించాడు. ఆ తరువాత డంబెల్ తో అతడి తలపై మోదారు. ఈ ఘటన తరువాత ప్రియుడు హరీశ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

మరుసటిరోజు ఉదయం చిట్టి డయల్ 100కు ఫోన్ చేసి.. తన భర్త రాత్రి ఎవరితోనో గొడవపడి వచ్చి నిద్రపోయాడని, ఉదయం చూస్తే చనిపోయి ఉన్నాడని చెప్పింది. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరీక్షించారు. చిట్టి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, పోలీసులు విచారణ మొదలుపెట్టగా.. చిట్టి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో చిట్టి అసలు విషయం బయటపెట్టింది. తన ప్రియుడు హరీశ్ తో కలిసి తన భర్త శేఖర్ ను హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెతోపాటు ఆమె ప్రియుడు హరీశ్ ను అదుపులోకి తీసుకున్నారు.