Telangana cabinet expansion: తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. బీసీ సామాజిక వర్గం నుంచి వి. శ్రీహరి ముదిరాజ్, ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకట స్వామి, మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు కొత్తగా మంత్రివర్గంలోకి చేరనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.19 నిమిషాలకు రాజ్ భవన్ లో వీరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే, మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఆశించి భంగపడిన నేతలు అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు.
Also Read: నూతన మంత్రులకు ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..
మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవి దక్కుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుందర్శన్ రెడ్డితోపాటు ప్రేమ్ సాగర్ రావులు ఆశించారు. కాంగ్రెస్ వర్గాల్లోనూ ఆ మేరకు చివరి వరకు చర్చ జరిగింది. అయితే, చివరి నిమిషంలో కేవలం బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రమే కాంగ్రెస్ హైకమాండ్ మంత్రి వర్గ విస్తరణలో చోటు కల్పించింది. దీంతో సుందర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ లు అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు.
క్యాబినెట్ విస్తరణలో తన పేరు లేకపోవడంతో అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసానికి ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్ లు వెళ్లారు. వారు సుందర్శన్ రెడ్డిని బుజ్జగిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతో మాట్లాడేందుకు మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, వారు ఇంకా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.