CM Revanth Reddy : రివెంజ్ పాలిటిక్స్.. కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి వ్యూహం..!

గ‌త స‌ర్కార్ వైఫ‌ల్యాల‌ను తవ్వితీస్తూ.. అవే బీఆర్‌ఎస్‌పై పోరాటానికి అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. కేసీఆర్‌ను టార్గెట్ చేయడంతోపాటు.. నాటి స‌ర్కార్‌లో ఏం జరిగింది? చెప్పింది ఏంటి? చేసిందేమింటి? రాష్ట్రానికి జరిగిన మేలెంత? న‌ష్టం ఎంత‌? అన్నది ప్రజ‌ల ముందు ఉంచేందుకు సిద్ధమవుతున్నారు.

మాజీ సీఎం కేసీఆర్‌ను ఇరుకున పెట్టడమే లక్ష్యమా..? గత ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్న కాళేశ్వరంలో భారీ అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయా? మేడిగడ్డ పిల్లర్‌ కుంగడాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అస్త్రంగా మార్చుకుంటుందా? సీఎం రేవంత్‌ టార్గెట్‌ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరిపించాలనే ఆలోచన వెనుక ఉన్న కారణాలేంటి?

కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అస్త్రంగా మార్చేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ప్రాజెక్టు నిర్మాణంలో అవ‌కత‌వ‌క‌లు, అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తూ గత ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నారు. కాళేశ్వరంపై జుడిషియ‌ల్ విచార‌ణతో పాటు.. అసెంబ్లీలో ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

కాళేశ్వరం నిర్మాణం సమయంలో మాజీ సీఎం కేసీఆర్‌.. అప్పటి అసెంబ్లీలో ఏ విధంగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేష‌న్ ఇచ్చారో.. ఇప్పుడు సేమ్‌ టు సేమ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేష‌న్ ఇవ్వాలని డిసైడ్‌ అయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. తన రివెంజ్ ప్లాన్‌లో భాగంగా ఏ వేదికపై నుంచి ప్రాజెక్టు గొప్పతనం చెప్పారో.. అదే వేదికలో అందులో డొల్లతనం వివరించాలని అనుకుంటున్నారు సీఎం. దీంతో శనివారం ఏ విధంగా అసెంబ్లీలో వాడివేడి సంవాదం చోటు చేసుకుందో.. అంతకు మించిన రక్తి కట్టించే సన్నివేశాలకు బుధవారం అసెంబ్లీ వేదిక కాబోతోందని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు.

Also Read : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇంజినీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అరెస్ట్

మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఎల్‌ అండ్ టీ ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమావేశమయ్యారు. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేసేది లేదని ఎల్‌ అండ్ టీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎల్‌ అండ్ టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక లేఖ అధికారికి రాసి తమ ప్రమేయం లేదంటూ ఊరుకోబోమని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హెచ్చరించారు. ప్రజాధనాన్ని వృధా చేసిన వారిని వదిలి పెట్టబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మేడిగడ్డ ప్రాజెక్ట్‌ నిర్మాణంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి.

సీఎంగా బాధ్యతలు స్వీకరించాక.. పరిపాలనపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న రేవంత్‌ రెడ్డి అన్నిరకాలుగా జోరు చూపిస్తున్నారు. ప్రభుత్వంలో ప్రక్షాళ‌నకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల్లో తన మార్క్‌ చూపిస్తున్న రేవంత్‌ రెడ్డి.. గ‌త స‌ర్కార్ వైఫ‌ల్యాల‌ను తవ్వితీస్తూ.. అవే బీఆర్‌ఎస్‌పై పోరాటానికి అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. కేసీఆర్‌ను టార్గెట్ చేయడంతోపాటు.. నాటి స‌ర్కార్‌లో ఏం జరిగింది? చెప్పింది ఏంటి? చేసిందేమింటి? రాష్ట్రానికి జరిగిన మేలెంత? న‌ష్టం ఎంత‌? అన్నది ప్రజ‌ల ముందు ఉంచేందుకు సిద్ధమవుతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇందులో భాగంగా కేసీఆర్‌ను ఇరుకన పెట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును ఓ ప్రధాన ఆయుధంగా మలుచుకుంటున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

Also Read : మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం.. కానీ ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నవారిని వదిలిపెట్టం : మంత్రి పొంగులేటి

కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ బ్రాండ్‌గా ప్రమోట్ చేసింది గత సర్కార్‌. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును రికార్డ్ స‌మ‌యంలో నిర్మించామని గొప్పలు చెప్పింది. అయితే ఎన్నికల ప్రచార సమయంలో ఆ ప్రాజెక్టే గత ప్రభుత్వాన్ని కుంగదీసింది. మేడిగడ్డ బ్యారేజ్‌లో ఓ పిల్లర్‌ జారిపోవడంతో కేసీఆర్‌ ప్రభుత్వం ఏం చెప్పాలో తేల్చుకోలేకపోయింది. ఇదే సమయంలో అన్నారం బ్యారేజీ కూడా కొంతమేర దెబ్బతినడంతో మరింత ఇరుకున పడింది అప్పటి ప్రభుత్వం.

ఐతే ఇప్పుడు ఇదే ఆయుధంగా బీఆర్‌ఎస్‌ పార్టీపై దండయాత్ర చేయాలని నిర్ణయించారు సీఎం రేవంత్‌రెడ్డి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప‌ట్టిన నాటి నుంచి.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ల‌క్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింద‌నే ప్రచారంలో వాస్తవమెంతో నిగ్గుతేల్చే పనికి పచ్చజెండా ఊపాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఎన్నికల ముందు ప్రధాని మోదీ నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ వరకు ప్రతిపక్ష పార్టీలు అన్నీ బీఆర్‌ఎస్‌ పార్టీ ఏటీఎంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిందని విమర్శలు చేశాయి.

అధికారం చేతులు మారడంతో నాటి ఆరోపణలపై న్యాయ విచారణ చేయించాలని తలపోస్తోంది కాంగ్రెస్ పార్టీ. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలంటే న్యాయ విచారణ జరిపించడం ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. నీటిపారుదల శాఖ సమీక్షలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరా తీసిన సీఎం.. జుడిషియ‌ల్ విచార‌ణ జ‌రిపించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు. బుధవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రకటన చేయనున్నట్లు చెబుతున్నారు.

Also Read : L&T ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం.. తప్పు చేసినవారిపై చర్యలు తప్పవంటూ వార్నింగ్

మరోవైపు ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు? అవినీతి? కొత్తగా పెరిగిన ఆయ‌క‌ట్టు ఎంత‌? అనే విషయాలపై స‌మ‌గ్ర స‌మాచారంతో అసెంబ్లీలో ప‌వ‌ర్ పాయింట్‌ ప్రజెంటేష‌న్ ఇవ్వాలని కూడా సీఎం నిర్ణయించారు. కాంగ్రెస్ హ‌యాంలో నిర్మించిన ప్రాజెక్టులు.. వాటి ద్వారా వ‌చ్చిన ఆయ‌క‌ట్టు… రైతుల‌కు జ‌రిగిన లాభం.. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన మేలును సరిపోల్చి ప్రజలకు వివరించాలని నిర్ణయించారు సీఎం.

గ‌తంలో కేసీఆర్ అసెంబ్లీలో ఏ విధంగా ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ ఇచ్చారో.. ఇప్పుడు దానికి దీటుగా కేసీఆర్ హ‌యాంలో జరిగిన త‌ప్పిదాల‌ను ప్రజలకు వివరించాలని సీఎం నిర్ణయించడంతో బుధవారం నుంచి జరిగే సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నాయంటున్నారు పరిశీలకులు. మొత్తం ఎపిసోడ్‌ను పరిశీలిస్తే 2014లో సీఎంగా కేసీఆర్‌ బాధ్యతలు స్వీకరించాక ఎట్లా అయితే కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టారో.. ఇప్పుడు అదే రివేంజ్‌ ప్లాన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి యాక్షన్‌లోకి దిగుతున్నట్లు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.

 

ట్రెండింగ్ వార్తలు