అడవుల్లో డీజీపీ..ఏం జరుగుతోంది ?

తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతంలో డీజీపీ ఆకస్మిక పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణేష్ అండ్ టీమ్ లొంగుబాటు వార్తల నేపథ్యంలో… డీజీపీ పర్యటన మరింత ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు మావోయిస్టుల కదలికలు, పోలీసుల కూంబింగ్‌తో ఏజెన్సీ ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణలోని ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతల లొంగుబాటు వార్తల నేపథ్యంలో… డీజీపీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. లొంగుబాటు మావో నేతల కుటుంబ సభ్యులతో డీజీపీ సమావేశం అయ్యే అవకాశం కూడా ఉంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పనిచేస్తోన్న అధికారులతో సమావేశం అయ్యి.. పరిస్థితిని ఎప్పటికప్పుడు డీజీపీ సమీక్షిస్తున్నారు.
ఆదిలాబాద్ అడవుల్లో భాస్కర్ దళం సంచరిస్తోందన్న నేపథ్యంలో… పోలీసులు కూంబింగ్ పెంచారు. టెక్కగూడలో జులై 14న భాస్కర్ దళానికి, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భాస్కర్ దళం మాత్రం తృటిలో తప్పించుకుంది. అయితే ఘటనా స్థలంలో పోలీసులు ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు. డైరీలోని వివరాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోంది.
తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడేళ్లు.. అలియాస్ భాస్కర్‌పై 20 లక్షలు, వర్గేశ్‌పై 5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యురాలు లింగవ్వ అలియాస్ అనిత, పాండు అలియాస్ మంగుపై 5 లక్షల బహుమతి ఉంది. అంతేకాదు.. మీనాపై 4 లక్షలు, రాము అలియాస్ సుధీర్‌పై 4 లక్షలు నగదు బహుమతి ఉంది. మావోయిస్టుల సమాచారం ఇస్తే.. నగదు బహుమతి ఇవ్వడంతోపాటు… వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని పోలీసులు పోస్టర్స్ వేశారు.
ఆదిలాబాద్ అడవుల్లోని మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచేందుకే డీజీపీ వస్తున్నారా లేక అగ్రనేతల లొంగుబాటులో భాగంగా.. పర్యటిస్తున్నారా అన్నది మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతితోపాటు మరో ముగ్గురు కీలక నేతల లొంగుబాటుపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
దీంతో తెలంగాణ మావోయిస్టుపార్టీ కేడర్ అప్రమత్తమయ్యింది. లొంగుబాటు అడ్డుకట్టకు తెలంగాణలో మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో సిబ్బందిని అలర్ట్ చేసేందుకు డీజీపీ ఏజెన్సీలో పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత తెలంగాణ ఏజెన్సీలో మావోయిస్టుల కదలికలు, పోలీసుల చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసులు గోప్యత పాటిస్తున్నా.. జరిగే పరిణామాలు మాత్రం ఉత్కంఠ కలిగిస్తున్నాయి.