school uniform Design
Telangana: విద్యార్థుల యూనిఫాంల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఈసారి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఒక జత యూనిఫామ్ ను ప్రతీయేటా ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, 2025-26 విద్యా సంవత్సరానికిగాను స్కూల్ యూనిఫామ్ డిజైన్ లో విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. కలర్ లో ఎలాంటి మార్పులు చేయకుండా.. డిజైన్ లో కొన్ని మార్పులు చేసి ఆర్డర్లు ఇచ్చేసింది.
2025-26 విద్యా సంవత్సరంలో 19.91లక్షల మంది విద్యార్థులకోసం యూనిఫామ్స్ ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వం. అయితే, 2023లో కొత్త డిజైన్ తో కూడిన యూనిఫామ్ లను ఇచ్చారు. ఎరుపు, బూడిద రంగు చొక్కా, మెరూన్ రంగు సూటింగ్ లో ఉన్నాయి. అప్పటి డిజైన్ లో షర్టులకు పట్టీలు, భుజంపై ఉచ్చులు పెట్టారు. అయితే, ఈ సారి కలర్ లో ఎలాంటి మార్పులు లేకుండా కేవలం డిజైన్ లో విద్యాశాఖ మార్పులు చేసింది. పట్టీలను తొలగిస్తూ కొత్త మోడల్ తీసుకొచ్చారు.
ప్రస్తుతం ఒక్కో జత యూనిఫాం కోసం ప్రభుత్వం రూ.75 చెల్లిస్తుంది. అయితే, 1వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థుల వరకు షర్ట్, నిక్కర్, 8వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు షర్ట్, ప్యాంట్ అందిస్తున్నారు.