తెలంగాణలోని ఈ ఫ్యాక్టరీలో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌.. దేశంలో ఎక్కడా దొరకనంతగా.. తీగలాగితే డొంక ఎలా కదిలిందంటే?

దర్యాప్తులో భాగంగా చివరికి అధికారులు తెలంగాణకు చేరుకున్నారు. అక్కడ ముఠా కెమికల్ ఫ్యాక్టరీని మాదక ద్రవ్యాల తయారీకి వాడుతున్నట్లు తేలింది.

Factory Representative image

Telangana Factory: తెలంగాణలోని ఓ ఫ్యాక్టరీలో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో ఈ ఏడాది ఇప్పటివరకు ఎక్కడా దొరకనంత భారీ ఎత్తున డ్రగ్స్‌ దొరకడంతో అధికారులే నివ్వెరపోయారు.

మహారాష్ట్రకు చెందిన మీరా-భాయందర్, వసై-విరార్ పోలీస్ యాంటీ-నార్కోటిక్స్ సెల్, క్రైమ్ బ్రాంచ్ కలిసి ఈ కేసును ఛేదించారు. తెలంగాణలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ ద్వారా ఓ ముఠా ఈ డ్రగ్స్‌ దందాను కొనసాగిస్తోంది.

ఈ ఫ్యాక్టరీలో రూ.12 వేల కోట్ల విలువైన మెఫెడ్రోన్ (ఎండీ)ని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. మెఫెడ్రోన్ ను మియావ్ మియావ్, మెఫ్, ఎం క్యాట్, మియావ్ అని కూడా పిలుస్తారు. ఇది యాంఫెటమైన్ గ్రూప్ లోని సింథటిక్ స్టిములెంట్. అంటే నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే పదార్థం.

Also Read: లవర్‌తో కలిసి భర్తను చంపి.. ఏమీ తెలియనట్లు ఏ రేంజ్‌లో ఏడ్చిందో వీడియో చూడండి.. ఆస్కార్‌ లెవెల్‌.. సాంప్రదాయినీ సుద్దపూసనీ..

మొదట పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. వారిలో ఒకరు విదేశీయుడు. వారి నుంచి తొలుత 100 గ్రాముల ఎండీ, రూ.25 లక్షల నగదు స్వాధీనం చేశారు. ఈ విచారణలో భాగంగానే పలు రాష్ట్రాల మధ్య నెట్‌వర్క్ ద్వారా పెద్ద ఎత్తున మెఫెడ్రోన్ ఉత్పత్తి, సరఫరా జరుగుతున్నట్లు బయటపడింది. దర్యాప్తులో చివరికి అధికారులు తెలంగాణకు చేరుకున్నారు. అక్కడ ముఠా కెమికల్ ఫ్యాక్టరీని మాదక ద్రవ్యాల తయారీకి వాడుతున్నట్లు తేలింది.

హైదరాబాద్ సమీపంలోని చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న వాఘ్దేవి ల్యాబ్స్ పేరుతో నడుస్తున్న ఆ ఫ్యాక్టరీ బయటకు చట్టబద్ధంగా కనిపించినా, లోపల పెద్ద ఎత్తున నార్కోటిక్స్ ఉత్పత్తి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

దాడిలో అధునాతన కెమికల్ పరికరాలు, మాదక ద్రవ్యాల ఉత్పత్తి యూనిట్లు, దాదాపు 32,000 లీటర్ల ప్రీకర్సర్ కెమికల్స్ సహా భారీ ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. (Telangana Factory)

ఫ్యాక్టరీ యజమాని, కెమికల్ నిపుణుడు శ్రీనివాస్ వాలోట్టి, అతడి సహచరుడు తనాజీ పాటేను అదుపులోకి తీసుకున్నారు. ఫ్యాక్టరీని మూసివేశారు. పలు ప్రాంతాల్లో మరిన్ని దాడులు చేస్తున్నారు.